
చిన్నమ్మ చిక్కులు
●రంగంలోకి సీబీఐ
సాక్షి, చైన్నె : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి చిన్నమ్మ శశికళ చక్కెర పరిశ్రమ కొనుగోలు సమస్యగా మారింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆమె పద్మావతి షుగర్స్‌ను కొనుగోలు చేసి బినామీ పేర్లతో నడిపిస్తుండటం సీబీఐ విచారణలో ఆధారాలతో తేట తెల్లమైంది. దీంతో చిన్నమ్మను విచారణ వలయంలోకి తెచ్చే కసరత్తులలో సీబీఐ ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. కాంచీపురంలో హిదేశ్ శివకన్ పటేల్ , ఆయన సోదరుడు దినేషన్ పటేల్ పద్మావతి షుగర్స్ పేరిట పరిశ్రమను నిర్వహిస్తూ వచ్చారు. ఈ పరిశ్రమ బ్యాంక్‌లో రుణం తీసుకుని మోసానికి పాల్పడినట్టుగా వచ్చిన ఫిర్యాదును తొలుత సీబీఐ పట్టించుకోలేదు. చివరకు బ్యాంక్ వర్గాలు కోర్టుకు వెళ్లడంతో ఈ ఫైల్ కదిలింది. సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరపడంతో ఈ పరిశ్రమను 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో చిన్నమ్మ శశికళ కొనుగోలు చేసి ఉండటం వెలుగులోకి వచ్చింది. రూ. 450 కోట్లకు ఈ పరిశ్రమను కొనుగోలు చేసి ఉన్నారు. రూ. 500, రూ. 1000 పెద్ద నోట్లతో ఈ పరిశ్రమను కొనుగోలుచేసి బినామీ పేర్లతో నడిపిస్తూ వచ్చినట్టు సీబీఐ విచారణలో తేట తెల్లమైంది. 2019లో చిన్నమ్మ శశికళ నివాసంలో జరిగిన సోదాల సమయంలో లభించిన ఆధారాలు, తాజాగా బ్యాంక్ మోసానికి పాల్పడిన పద్మావతి షుగర్స్‌యాజమాన్యం వద్ద జరిపిన సోదాలలో అభించిన ఆధారాల ఆధారంగా ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సీబీఐ సన్నద్ధమైనట్టు సమాచారం వెలువడ్డాయి. చిన్నమ్మ శశికళకు ఇప్పటికే నోటీసులు జారీచేసినట్టుసంకేతాలు వెలువడ్డాయి. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయడానికి సీబీఐ నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడటంతో రానున్న కాలంలో చిన్నమ్మకు ఈ షుగర్ పరిశ్రమ ఉచ్చుగా మారే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది.