
ఎవరు కావాలో తెల్చుకోండి!
సాక్షి, చైన్నె: కూటమికి ఎవరు కావాలో అన్నది మీరే తెల్చుకోండి అని బీజేపీ పెద్దలకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ అల్టిమేటం ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌పై విరుచుకు పడ్డారు. అన్నాడీఎంకేలో చీలికతో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డీఏతో పయనించిన ఈ పార్టీ నేత టీటీవీ దినకరన్ తాజాగా బయటకు వచ్చారు. ఇందుకు కారణం బీజేపీలోకి అన్నాడీఎంకే చేరికే. ఈ పరిణామాలతో టీటీవీతో పాటూ మాజీ సీఎం పన్నీరు సెల్వంను బీజేపీ పట్టించుకోవడం మానేసింది. దీంతో ఒకరి తర్వాత మరొకరు ఎన్‌డీఏ కూటమి నుంచి పన్నీరు, దినకరన్ బయటకు వచ్చారు. అయితే టీటీవీ దినకరన్, పన్నీరు సెల్వంను మళ్లీ కూటమిలోకి రప్పిస్తామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇందుకు దినకరన్ ధీటుగా శనివారం స్పందించారు.
షరతులు..
మీడియాతో టీటీవీ దినకరన్ మాట్లాడుతూ, వినాసకాలే విపరీత బుద్ధి, చెడకు రా..చెడేవు అన్నట్టుగా పళణి స్వామి తీరు అన్నాడీఎంకేలో ఉందని మండిపడ్డారు. ఇక, ఎన్‌డీఏ విషయానికి వస్తే, బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై ఉన్నంత కాలం మిత్ర పక్షాలతో సత్సంబంధాలతో మెలిగారని వివరించారు. అయితే నైనార్ నాగేంద్రన్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పీఎంకే అపాయింట్‌మెంట్ విషయంలో పన్నీరు సెల్వంకు తీవ్ర అన్యాయం తలబెట్టింది కాకుండా, అహంకారంతో నైనార్ వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. తమ వరకు కూటమి విషయంలో ఎన్‌డీఏకే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అయితే ఈసారి షరతులు విధించడం ఖాయం అని స్పష్టం చేశారు. ఏం చేస్తారో చేసుకోండి, ఎవరు కావాలో వాళ్లే తేల్చుకోని అని కమలనాథుల కోర్టులోకే బంతిని నెడుతున్నా! అని వ్యాఖ్యలు చేశారు. తామంతా బిస్కట్ పార్టీ అని వ్యాఖ్యలు చేస్తున్నారని, తమ సత్తా ఏమిటో ఓట్ల రూపంలో తెలుస్తూనే ఉందిగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విజయ్ రాజకీయాలోకి వచ్చారని, ఆయన నేతృత్వంలో కూటమి ఏర్పాటైన పక్షంలో బిస్కట్ పార్టీలు చేరడంలో తప్పే లేదంటూ వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఒక పార్టీ నాయకుడు అని, ఆయన్ని అవమానించే విధంగా ప్రశ్నలు సంధించ వద్దని మీడియాకు హితవు పలకడం గమనార్హం.