
దేశ సేవకు.. సగర్వంగా..!
పరేడ్
సాక్షి, చైన్నె : చైన్నె సెయింట్ థామస్ మౌంట్‌లో ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో అధికారులు భారత ఆర్మీలో వివిధ హోదాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఏటా ఇక్కడ శిక్షణ ముగించుకునే యువ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్‌తో దేశ సరిహద్దులలో సేవకు సన్నద్ధం కావడం జరుగుతుంటుంది. ఆ దిశగా ప్రస్తుతం శిక్షణ ముగించిన యువ అధికారులు శుక్రవారం జరిగిన సాహస విన్యాసాల ప్రదర్శనలో తమ ప్రతిభను చాటుకున్నారు. శిక్షణ కాలంలో నేర్చుకున్న యుద్ధ సాహసాలు, విన్యాసాలు సీనియర్ అధికారులు, తమ కుటుంబ సభ్యుల, ఆర్మీ వర్గాల సమక్షంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. రెండవ రోజైన శనివారం ఉదయాన్నే పాసింగ్ అవుట్ పరేడ్ దేశభక్తిని చాటే విధంగా జరిగింది.
పతకాలు..
పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, పీవీఎస్‌ఎం, ఏవీఎస్‌ఎం, సీఏఎస్ సమీక్షించారు. ఏసీఏ రాజ్ బిశ్వాస్‌కు స్వోర్డ్ ఆఫ్ ఆనర్, సిల్వర్ మెడల్‌ను ప్రదానం చేశారు. ఓటీఏ గోల్డ్‌మెడల్‌ను ఏయూఓ పరుదల్ తద్వాల్‌కు, క్యాంస పతకాన్ని బీయూఓ పరంజల్ దీక్షిత్‌కు ప్రదానం చేశారు. ఆఫీసర్ క్యాడెట్లను ఈసందర్భంగా అమర్ ప్రీత్ సింగ్ అభినందించారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించారు. కొత్తగా ఆర్మీకి నియమితులైన వారు ఆదర్శప్రాయమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం దేశానికి నిస్వార్థ సేవ, శ్రేష్ఠత కోసం స్థిరమైన ప్రయత్నం, ప్రధాన సైనిక విలువలు, అన్ని ప్రయత్నాలతో సాగిన స్వచ్ఛమైన కవాతు తరువాత, పిప్పింగ్ వేడుక ఒక గంభీరమైన ప్రతిజ్ఞను దర్పణంగా నిలిచింది. కొత్తగా నియమితులైన యువ అధికారుల భుజాలపై మెరిసే స్టార్ చిహ్నాలను అందజేసి అలంకరింప చేశారు. భారత రాజ్యాంగానికి విధేయత చూపుతూ, దేశాన్ని పూర్తిగా కాపాడటానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.కొత్తగా నియమితులైన అధికారులు, తమ ర్యాంకులు , రెజిమెంటల్ హోదాలను ధరించి,దేశానికి, భారత రాజ్యాంగానికి విధేయత చూపుతూ గౌరవంగా సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని, దేశ గౌరవాన్ని కాపాడుతామంటూ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఆనందంగా సరిహద్దులకు ప్రయాణమయ్యారు. ముందుగా ఈ యువ అధికారులు కేరింతలు కొడుతు, గాల్లో బెలూన్లను ఎగుర వేస్తూ ఆనందాన్ని పరస్పరం పంచుకున్నారు.
పరేడ్‌తో సరిహద్దులకు..
చైన్నె సెయింట్ థామస్ మౌంట్‌లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పరమేశ్వరన్ స్క్వేర్‌లో షార్ట్ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ వేడుక ఉదయం జరిగింది. ఇందులో 120 మంది యువ అధికారులు, 34 మంది మహిళా యువ అధికారిణులు ఉన్నారు. మార్షల్ ట్యూన్‌లకు ఆఫీసర్ క్యాడెట్‌ల కవాతు అందర్నీ మంత్రముగ్ధులను చేసింది. ఆఫీసర్ క్యాడట్ల తల్లిదండ్రులకు, శిక్షణ అందించిన అధికారులకు గొప్ప క్షణంగా నిలిచే విధంగా ఒక సంవత్సర కాలం తాము నేర్చుకున్న ఇంటి గ్రేటెడ్ శిక్షణను యువ అధికారులు ప్రదర్శించారు. ఈ గర్వించదగ్గ యువ అధికారులు భవిష్యత్తు నాయకులుగా అవతరించే దిశగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో విదేశాలతో ఉన్న సత్సంబంధాల మేరకు ఇక్కడ మరో తొమ్మిది మంది యువ అధికారిణిలు, పన్నెండు మంది యువ అధికారులు సైతం శిక్షణ పొందడం విశేషం. భారత సైన్యం లోని వివిధ ఆయుధాలు, సేవలలోకి, స్ఫూర్తిని , త్యాగం దిశగా వీరంతా శిక్షణ పూర్తిచేశారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో స్నేహం , సహకార బంధాలను పెంపొందించడం లక్ష్యంగా ముందడుగు వేయనున్నారు.

దేశ సేవకు.. సగర్వంగా..!

దేశ సేవకు.. సగర్వంగా..!

దేశ సేవకు.. సగర్వంగా..!