
వేటు పడింది!
సెంగోట్టయన్‌కు షాక్
పదవుల నుంచి తొలగింపు
పళణి నిర్ణయంపై విమర్శలు
కాలం సమాధానం చెబుతుందని వ్యాఖ్య
అన్నాడీఎంకేలో ఐక్యత, సమన్వయ గళాన్ని అందుకున్న సీనియర్ నేత, ఎమ్మెల్యే సెంగోట్టయన్‌పై వేటు పడింది. రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శితో పాటూ ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఆయన్ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తప్పించారు. ఈ ప్రకటన కాస్త విమర్శలకు దారి తీసింది. పార్టీ గెలుపు దృష్ట్యా, అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం నేరమా..? అని ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో సెంగోట్టయన్ అత్యంత సీనియర్ నేత అన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో విబేధాలు, అసంతృప్తి అన్నది ఉన్నప్పటికీ సెంగోట్టయన్ అందర్నీ కలుపుకుని ముందుకు వెళ్లాలన్న నినాదంతో, పార్టీలో చీలిక రాకూడదన్న ఉద్దేశంతో మౌనంగా ముందుకెళ్తూ వచ్చారు. ఈ పరిస్థితులలో శుక్రవారం ఆయన మనస్సు విప్పి మాట్లాడారు. అన్నాడీఎంకే 2026లో అధికారంలోకి రావాలంటే అందరూ ఏకం కావాల్సిందేనన్న సందేశాన్ని అందుకున్నారు. పార్టీ నుంచి బహిష్కరించ బడ్డ వాళ్లు, బయటకు వెళ్లిన వారందర్నీ మళ్లీ ఏకం చేయాలని సమిష్టి సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొంటే అధికారం మనదే అన్న అభిప్రాయాన్ని సెంగోట్టయన్ వ్యక్తం చేశారు. ఇందుకు గాను పళణికి పది రోజులు గడువు విధించారు. లేని పక్షంలో తానే స్వయంగా తన లాంటి వారందర్నీ ఏకంచేసి సమన్వయ పరుస్తానని హెచ్చరించారు.
కాలమే సమాధానం..
తనను పార్టీ పదవుల నుంచి తప్పించడం గురించి సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడారు. పార్టీ గెలవాలి, అధికారంలోకి రావాలన్న కాంక్షతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని, దీనిని పరిశీలించాల్సిన బాధ్యత ప్రధాన కార్యదర్శికి ఉందన్నారు. తాను ప్రత్యక్షంగా , స్వయంగా ఈ అభిప్రాయం తెలియజేశానని, చివరకు ప్రజాక్షేత్రం నుంచి కేడర్ మనస్సులోని మాటలను తాను మనస్సు విప్పి మాట్లాడటం తప్పా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో వివరణ కోరే అవకాశం అన్నది ఉంటుందని, ఇందుకు కూడా అవకాశం ఇవ్వకుండా తనను పార్టీ నుంచి తప్పించడం శోచనీయమన్నారు. తన వ్యక్తిగత సంక్షేమం కోసం అభిప్రాయాలను వ్యక్తం చేయలేదని, పార్టీ కోసం అన్న విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా పళణి స్వామి హితవు పలికారు. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందని, తనను పదవి నుంచి తొలగించడంలో ఎలాంటి బాధ లేదని, ఆనందంగానే ఉందన్నారు. అయితే, దీనిని తాను ఎదురు చూడలేదన్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలో ప్రజా చైతన్య యాత్ర ద్వారా తన బలం అన్నది పెరిగిందన్న ధీమాతో పళణి స్వామి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకేకు ఇక అన్నీ తానేనని, తనకు వ్యతిరేకంగా ఏదేని కుట్రలు, వ్యూహాలు పన్నే వారికి హెచ్చరికగా సెంగోట్టయన్‌ను ఆగమేఘాలపై పదవి నుంచి తప్పించినట్టు చర్చ జరుగుతోంది. అదే సమయంలో తదుపరి సెంగోట్టయన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో, పది రోజులలో ఎలాంటి ప్రకంపన అన్నాడీఎంకేలో బయలు దేరనున్నదో అన్న చర్చ ఊపందుకుంది.
పదవి నుంచి ఉద్వాసన..
సెంగోట్టయన్ చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే బహిష్కరణ నేతలు, బయటకు వెళ్లిన వారే కాదు, బీజేపీ, డీఎండీకేతో పాటుగా పలు పార్టీలు ఆహ్వానించాయి. సెంగోట్టయన్ నిర్ణయాన్ని ఆహ్వానించాయి. అయితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి మాత్రం సెంగోట్టయన్ వ్యాఖ్యలు ఆగ్రహాన్ని తెప్పించాయి. శనివారం అన్నాడీఎంకే కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో సెంగోట్టయన్‌ను పదవుల నుంచి తప్పించడం గమనార్హం. సెంగోట్టయన్ వ్యవహరిస్తూ వచ్చిన పార్టీ నిర్వాహక కార్యదర్శి, ఈరోడ్ రూరల్‌పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. అలాగే, ఆయన మద్దతు దారులు పలువుర్ని పార్టీ పదవుల నుంచి తప్పించారు. ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా బాధ్యతలు తాతాల్కింగా పార్టీ నేత ఏకే సెల్వరాజ్‌కు అప్పగించారు. ఈ ప్రకటన సెంగోట్టయన్, ఆయన మద్దతు దారులకు పెద్ద షాక్‌గా మారింది. తాము అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఏకగా పదవుల నుంచి తప్పిస్తారా? అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించే పనిలో పడ్డారు. అదే సమయంలో పళణి నిర్ణయంపై అన్నాడీఎంకే మిత్రులు సైతం పరోక్షంగా విమర్శలు గుప్పించే పనిలో పడడం గమనార్హం.

వేటు పడింది!