
సమన్వయ గళం
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకేలో ఐక్యత, సమన్వయం, సమష్టి నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. పార్టీ సీనీయర్ నేత సెంగోట్టయన్ తన మనస్సులోని మాటల్ని శుక్రవారం ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం వేదికగా బయటపెట్టారు. అందర్నీ కలుపుకెళ్లాల్సిందేనని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి అల్టిమేటం ఇచ్చారు. ఇందుకు పది రోజుల గడువు కేటాయిస్తూ హెచ్చరికలు చేశారు. పార్టీలో చీలిక రాకూడదన్న ఉద్దేశంతో ఎన్నో త్యాగాలను తాను చేశానని, ఇక అందర్నీ సమన్వయ పరిచే బాధ్యతలు తన లాంటి వారందర్నీ ఏకం చేసి ముందడుగు వేయడానికి సిద్ధం అని ప్రకటించారు.
అన్నాడీఎంకే నుంచి తొలుత శశికళ, టీటీవీ దినకరన్, మద్దతుదారులు బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. దినకరన్ నేతృత్వంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఆవిర్భవించడంతో అన్నాడీఎంకే కేడర్ ముక్కలైంది. ఆ తర్వాత మాజీ సీఎం పన్నీరుసెల్వంను బహిష్కరించడంతో కార్యకర్తల హక్కుల సాధన కమిటీ పేరిట అన్నాడీఎంకేను కై వసం చేసుకునేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కేడర్ ముక్కలైనా, సీనియర్లు తన వెన్నంటే అని చాటుకునే విధంగా ప్రజాచైతన్య యాత్రతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి పరుగులు తీస్తున్నారు. అయితే, 2019 నుంచి ఎదురవుతున్న వరుస ఓటముల నేపథ్యంలో అన్నాడీఎంకేను సమన్వయ పరచాల్సిన అవసరం ఉందని శశికళ ప్రయత్నాలు మొదలెట్టగా, ఇందుకు పన్నీరుసెల్వం సైతం మద్దతు ప్రకటించారు. అయితే, పళణి స్వామి ఏ మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చేతిలోకి అధికారం దక్కాలంటే అందరూ ఐక్యత, సమన్వయంతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందంటూ సెంగోట్టయన్ సైతం స్పష్టం చేయడం గమనార్హం.
ఎంజీఆర్, జయలలితను స్మరిస్తూ...
మీడియా ముందుకు వచ్చిన సెంగోట్టయ్యన్ అన్నాడీఎంకేలోని పరిణామాలను వివరించారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత రాజకీయ పయనం, వారితో ఉన్న అనుబంధం గురించి గుర్తుచేశారు. తమకు వ్యతిరేకంగా వ్యూహాల్ని రచించిన వాళ్లనే ఎంజీఆర్, జయలలిత క్షమించి, కీలక పదవులలో ఉంచుకున్నారని వివరించారు.
అక్కున చేర్చుకుందాం
2026 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవాలంటే బయటకు వెళ్లిన వారందర్నీ అక్కున చేర్చుకోవాల్సిందే అని నినదించారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వెళ్లిన వారందర్నీ త్వరితగతిన ఏకం చేయాలని డిమాండ్‌చేశారు.
పది రోజుల గడువు
అన్నాడీఎంకే సమన్వయం, ఐక్యం, సమష్టి గళం అన్నది కీలకం అని, ఇందు కోసం కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిందేనని హెచ్చరిస్తూ, పళణిస్వామికి పదిరోజుల గడువును సెంగోట్టయన్ విధించారు. అంతలోపు ప్రయత్నం జరగని పక్షంలో తన లాంటి వారందర్నీ ఏకం చేసి తామే ముందడుగు వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
బీజేపీ ఆహ్వానించడంతో మార్చిలో తాను కేంద్ర మంత్రులను కలిసిన మాట వాస్తవమేనని, కేంద్ర మంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లను బీజేపీ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు తాను వెళ్లి కలిసి వచ్చినట్టు మీడియా ప్రశ్నకు వివరించారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేస్తూ, ఇదేదో 2024 లోక్‌సభ ఎన్నికలలో చేసి ఉంటే 30 స్థానాల్లో విజయఢంకా మోగించి ఉండే వాళ్ల మని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం అన్నాడీఎంకేకు అన్ని ఎన్నికలలో చిక్కులు , సమస్యలే ఉన్నాయని, అందుకే బయటకు వెళ్లిన వారందర్నీ కలుపుకుని ముందుకెళ్దామన్న నినాదాన్ని తాను అందుకున్నట్టు స్పష్టం చేశారు. ఈప్రకటన నేపథ్యంలో ఈరోడ్, తిరుప్పూర్, కొంగు మండలంలోని జిల్లాల్లో ఉన్న పన్నీరుసెల్వం మద్దతు ముఖ్య నేతలందరూ వెళ్లి సెంగోట్టయన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం.
పన్నీరు , చిన్నమ్మ అభినందన
సెంగోట్టయ్యన్ ర్యాలీ
పళణిస్వామి, సెంగోట్టయన్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా, అన్నాడీఎంకేలో సెంగోట్టయ్యన్ సీనియర్. ఇటీవల తీవ్ర అసంతృప్తితో ఉంటూ వచ్చిన సెంగోట్టయన్ శుక్రవారం ఈరోడ్‌లోని గోబిచెట్టి పాళయంలో ఉన్న అన్నాడీఎంకే కార్యాలయంలో ఐక్యతా నినాదాన్ని అందుకున్నారు. పెద్ద ఎత్తున మద్దతు దారులతో కలిసి ఊరేగింపుగా సెంగోట్టయన్ కార్యాలయానికి రావడంతో ఆయన కొత్త పార్టీ పెట్టేనా అన్న చర్చ ఉదయాన్నే ఊపందుకుంది. ఆమేరకు మద్దతుదారులు కొన్ని కిలోమీటర్ల దూరం ర్యాలీగా సెంగోట్టయన్ వెన్నంటి కదిలి వచ్చింది.
శశికళ ప్రధాన కార్యదర్శిగా
జయలలిత కూటమి రెండు సార్లు విజయఢంకా మోగించి అధికారాన్ని రాష్ట్రంలో చేజిక్కించుకుందని వివరిస్తూ దురదృష్ట వశాత్తు అమ్మ అనంత లోకాలకు వెళ్లారని ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ శశికళను అందరూ కలిసే ఎంపిక చేశామన్నారు. కాలానుగుణంగా చోటు చేసుకున్న పరిణామాలతో సీఎం ఎంపిక అనివార్యమైందని, ఈ సమయంలో పళణిస్వామి పేరును సీఎంగా శశికళ ఎంపిక చేశారని , ఇందుకు అందరం కట్టుబడి ఆమోదం తెలియజేశామన్నారు. అమ్మ మరణం తర్వాత తనకు రెండు అవకాశాలు వచ్చినా, వాటిని త్యాగం చేశానని పేర్కొన్నారు.
సెంగోట్టయ్యన్ నినాదాన్ని మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆహ్వానించారు. ఆయన తీసుకున్న నిర్ణయం, అడుగు అభినందనీయమన్నారు. శశికళ స్పందిస్తూ, అన్నాడీఎంకే రక్తం సెంగోట్టయ్యన్‌లో ప్రవహిస్తోందని, అందుకే ఆయన సరైన సమయంలో గళాన్ని వినిపించారని, అందరూ ఏకం అవుదామని పిలుపు నిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందిస్తూ, అన్నాడీఎంకేలో అందరూ ఏకం కావడం, ఐక్యంగా ముందడుగు వేయాలనుకోవడం మంచి విషయమేనని వ్యాఖ్యానించారు. పన్నీరు, టీటీవీని ఎన్‌డీఏ కూటమిలో చేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా, సెంగోట్టయ్యన్ పూర్తి స్థాయిలో మనస్సు విప్పలేదని, ఇంకా పూర్తిగా విప్పాలంటూ వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యానించారు. అయితే, అన్నాడీఎంకే తరఫు నుంచి నేతలు మౌనం వహించడం గమనార్హం.

సమన్వయ గళం