
తిరుచెందూర్ ఆలయానికి స్వర్ణ రథం
సాక్షి, చైన్నె : తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయానికి బంగారు రథం సిద్ధమైంది. దీనిని శుక్రవారం మంత్రులు శేఖర్‌బాబు, అనితా రాధాకృష్ణన్ ప్రారంభించారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరు సముద్ర తీరంలో సెంథిల్ నాధర్‌గా సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కొలువై ఉన్న విషయం తెలిసిందే. ప్రసిద్ది చెందిన ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి పరిచే మాస్టర్ ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. నిత్యం వేలాదిగా తరలి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక నిర్మాణాలు, వసతులు వేగవంతం చేశారు. ఈపనుల నిమిత్తం గత ఏడాది స్వర్ణ రథోత్సవ సేవను నిలుపుదల చేశారు. ఈ కాలంలో స్వర్ణరథానికి మరింత మెరుగులు దిద్దారు. జీర్ణోద్ధరణపనులు ముగించి కుంభాభిషేకాన్ని ఇటీవల విజయవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో స్వర్ణ రథోత్సవాన్ని 13 నెలల అనంతరం మళ్లీ పునరుద్ధరించారు. శుక్రవారం ఆలయంలో విశిష్ట పూజలు జరిగాయి. స్వర్ణరథంపై సెంథిల్‌నాదర్, వళ్లి దేవాసేన సమేతంగా భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ రథాన్ని మంత్రులు ప్రారంభించారు.