
చైన్నె వేదికగా ట్రయాథ్లాన్
సాక్షి, చైన్నె: చైన్నె వేదికగా దేశంలో తొలిసారిగా ట్రయాథ్లాన్ నిర్వహించనున్నారు. 2026 జనవరి 11న ఈస్ట్ కోస్టు రోడ్డులోని ఎంజీఎం బీచ్ రిసార్ట్‌లో ఈ రేస్ జరగనుంది. 5150ట్రయాథ్లాన్ చైన్నె పేరిట ఐరన్ మ్యాన్ ఇండియాతో కలిసి తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ రేష్ ఫార్మాట్‌ను తీసుకు రానున్నది. శుక్రవారం చైన్నెలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం, క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ రేస్ లోగోను ఆవిష్కరించారు. 2011లో తొలి సారిగా 5150 ట్రయాథ్లాన్ ప్రపంచ ఆదరణ పొందిందని, ఆ తదుపరి క్రమం తప్పకుండా జరుగుతూ వస్తున్న రేస్ తాజాగా తమిళనాడును వేదికగా ఎంపిక చేశామని ఐరన్ మ్యాన్ ఇండియా కంట్రీ హెడ్ దీపక్‌రాజ్, రేస్‌డిప్యూటీ డైరెక్టర్ ఆరతి స్వామినాథన్‌లు ప్రకటించారు. అథ్లెట్లకు కొత్త అవకాశాలను కల్పించే విధంగా రేసింగ్ ఫార్మాట్‌ను తీసుకొస్తున్నామని, రేస్ విభాగాలకు స్ప్రింట్ డ్యూయాథాన్‌గా 5 కి.మీ దూరం పరుగు, 20 కి.మీ దూరం సైకిల్, ఒలింపిక్ డ్యూయాథాన్ 10 కి.మీ పరుగు, 40 కి.మీ సైకిల్, ఐరన్ కిడ్స్ చైన్నె రేసులో 6–16 సంవత్సరాల్లోపు వారికి ఒకటి, రెండు, మూడు కి.మీ దూరాలలో రేస్‌లు నిర్వహించనున్నామని వివరించారు. ట్రయాథ్లాన్‌కు తమిళనాడు ప్రభుత్వం మూడు కోట్లను మంజూరు చేసినట్టు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. ఆసియాలో తమిళనాడును ఈ పోటీలకు ఎంపిక చేయడం ఆహ్వానిస్తున్నామన్నారు. 300 మంది ట్రయాథ్లెట్లు, 200 మంది డ్యూఅథ్లెట్లు, ఐరన్‌కిడ్స్ ఈ పోటీలలో భాగస్వామ్యం కానున్నారని వివరించారు. సీఎం స్టాలిన్ సారథ్యంలో ఇప్పటికే అనేక పోటీలను దిగ్విజయవంతంగా నిర్వహించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రేసును కూడా మరింత విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్ర, స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్యకార్యదర్శి జె.మేఘనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.