
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో పెరియార్ చిత్రపటం
సాక్షి, చైన్నె: ద్రావిడ సిద్ధాంతకర్త పెరియార్‌కు లండన్‌లో అరుదైన గౌరవాన్ని కల్పించారు. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆవిష్కరించారు. జర్మనీ పర్యటన ముగించుకుని సీఎం స్టాలిన్ తాజాగా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్ వర్సిటీని సీఎం సందర్శించారు. ఇక్కడ ప్రొఫెసర్ ఫైసల్ ప్రేమ్‌జీ, ప్రొఫెసర్ జిమ్ లెనిన్స్, విద్యావేత్త ప్రమీలా బెస్టర్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రాజతో కలిసి సదస్సకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెరియార్ చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా ప్రపంచంలోని అత్యుత్తమ మేధావులను ఈ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తయారు చేస్తూ వస్తున్నట్టు గుర్తు చేశారు. ఇక్కడ ప్రసంగించే భాగ్యం తనకు దక్కడం మహాభాగ్యంగా వ్యాఖ్యానించారు. పెరియార్ ద్రావిడ సేవలను వివరిస్తూ, నేడు ప్రపంచవ్యాప్తంగా ఆయన అవసరం ఉందన్నది వాస్తవమని వ్యాఖ్యానించారు.
ఆత్మగౌరవ ఉద్యమం
పెరియార్ సృష్టించిన ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రపంచీకరించడం లక్ష్యంగా ఇక్కడ సదస్సును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ద్రవిడ ఆత్మగౌరవ ఉద్యమ కొనసాగింపుగా కలైంజ్ఞర్ సేవలు, తన ప్రయాణాన్ని గుర్తు చేశారు. పెరియార్ ప్రపంచవ్యాప్తంగా నాస్తిక వాదాన్ని కాదు, హేతు వాదాన్ని ప్రోత్సహించారని వివరించారు. మానవ సమాజం కోసం ప్రపంచంలోని ప్రజలందరి కోసం ఆయన పయనం సాగిందన్నారు. పెరియార్ అంటే ఆత్మగౌరవం, హేతుబద్ధత, సమానత్వం, దాతృత్వం, రక్తబేధం లేదు, లింగ వివక్షత లేదు, స్వీయ–అభివృద్ధి, మహిళా పురోగతి, సామాజిక న్యాయం, లౌకిక రాజకీయాలు, శాసీ్త్రయ దృక్పథమని వివరించారు. ఆయన జ్ఞాన సాగరాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. సామాజిక న్యాయ విధానం తమిళనాడుకే కాదు, భారతదేశానికి కూడా వర్తిస్తుందని, భారత రాజ్యాంగం ఒక సమగ్ర సూత్రంగా పెరియార్ సాధ్యం చేశారని వివరించారు. ముందుగా హిందూజా గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థతో ఒప్పందాలు జరిగాయి. తమిళనాడులో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టే విధంగా ఒప్పందాలు జరిగాయి. అలాగే చైన్నెలో ఉన్న ఆస్ట్రాజెనెకా ప్రపంచ ప్రధాన కార్యాలయం, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సెంటర్ రూ.176 కోట్లతో విస్తరించేందుకు నిర్ణయించారు. సీఎం స్టాలిన్ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. తమిళనాడుకు సీఎం విదేశీ పర్యటనతో తాజాగా మొత్తం రూ.13,016 కోట్ల పెట్టుబడి వచ్చినట్టైంది.

ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో పెరియార్ చిత్రపటం