
ఆడుతురైలో ఉద్రిక్తత
సాక్షి, చైన్నె: తంజావూరు జిల్లా పరిధిలోని ఆడుతురైలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ఆడుతురై మున్సిపాలిటీ చైర్మన్ మాకా స్టాలిన్‌పై పెట్రోబాంబు దాడి జరిగిన సమాచారంతో పీఎంకే వర్గాలు రెచ్చి పోయాయి. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌చేస్తూ రోడ్డెక్కారు. రోడ్డుపై టైర్లను తగలబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అన్ని దుకాణాలు ఆడుతురైలో మూతపడ్డాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పీఎంకే వర్గాలు ఏమాత్రం తగ్గలేదు. దీంతో పెద్ద ఎత్తున బలగాలను ఆడుతురైలో రంగంలోకి దించారు.
పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకేకు పరాజయాలు
తిరుత్తణి: పళనిస్వామి స్వలాభం కోసం అతని నేతృత్వంలోని అన్నాడీఎంకేకు పరాజయాలు మాత్రమే దక్కుతాయని మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ నరసింహన్ ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, మాజీమంత్రి సెంగోట్టయన్ శుక్రవారం విలేరులతో మాట్లాడారు. అన్నాడీఎంకేను విజయం వైపు తీసుకురావాలంటే ప్రధన కార్యదర్శి, చిత్తశుద్ధితో వ్యవహరించి పార్టీకి దూరమైన నాయకులను పార్టీలోకి తీసుకొచ్చి కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. ఇందుకోసం ఎడపాడి పళనిస్వామికి పది రోజులపాటు సమయం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించిన సెంగోట్టయన్‌కు పార్టీలో వ్యతిరేకతతోపాటు ఒకవర్గం మద్దతు సైతం పలుకుతున్నది. దీంతో అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకేలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్, ఢిల్లీ మాజీ ప్రతినిధిగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే నరసింహన్ శుక్రవారం తిరుత్తణిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. పేదల కోసం ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించి, విజయం వైపు తీసుకెళ్లారని, అమ్మ జయలలిత పార్టీని మరింత పటిష్టం చేసి పదేళ్ల పాటు అధికారంలోకి తీసుకొచ్చి, దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా అన్నాడీఎంకేను తీసుకెళ్లారని తెలిపారు. అయితే శశికళ మద్దతుతో సీఎంగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి తరువాత కాలంలో అధికారం తనకు మాత్రమే కావాలనే ఒంటెద్దు ధోరణిలో వ్యవహరించడంతో చాలా మంది నాయకులు పార్టీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. దీంతో పార్టీ పరాజయాల వైపు పయనిస్తున్నట్లు తెలిపారు. పార్టీకి పూర్వ వైభవం కోసం నాయకులంతా ఏకం కావాలని అందుకు ఎడపాడి సిద్ధం కావాలని కోరారు.
ఉత్తమ చిత్రాలకు
వేదికగా టాటా ప్లే బింగే
సాక్షి, చైన్నె: ఉత్తమ చిత్రాలకు వేదికగా టాటా ప్లే బింగే మారి ఉందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రయాణంలో తాజాగా దిగ్గజ నటుడు హీరో మమ్ముట్టికి సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాబితాను పొందు పరిచామని వివరించారు. అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే దృఢ సంకల్పం, నిజాయితీ కలిగిన న్యాయవాదిగా మమ్ముట్టి అద్భుతంగా నటించిన మౌనం సమ్మదం, గొప్ప హిట్‌లుగా నిలిచిన కన్నుర్ స్క్వాడ్‌తో పాటుగా దిగ్రేట్ ఫాదర్.. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో జాబితాలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఓటీటీ యాప్‌లకు టాటా ప్లే బింగే ఒక్క సబ్‌స్క్రిప్షన్ ఉపయోగకరంగా ఉంటుందని, 30 కంటే ఎక్కువ వేదికలను ఉపయోగించుకునే అవకాశం కల్పించామని ప్రకటించారు.
కాగిదపట్టరైలో పీహెచ్‌సీకి భూమి పూజ
వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని కాగిదపట్టరై సారధినగర్‌లో జాతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.75 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడానికి శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే కార్తికేయన్ భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పీహెచ్‌సీ ఏర్పాటు చేయడం ద్వారా రోగులకు చికిత్స చేసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, చిన్న పిల్లల వార్డు, ప్రసూతి వార్డు వేర్వేరుగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేయర్ సుజాత, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, జోన్ చైర్మన్ వీనస్ నరేంద్రన్, కౌన్సిలర్ మురుగన్, కుమార్, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.