
విద్యార్థులకు ఆర్థిక సాయం
తమిళసినిమా: సీనియర్ నటుడు, సూర్య, కార్తీల తండ్రి శివకుమార్ తన 10వ చిత్రం సందర్భంగా విద్యాసేవలకుగానూ విద్యా ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అర్హులైన పేద విద్యార్థులకు తన ఆర్థికసేవలను నిర్వహిస్తున్నారు. కాగా తాజాగా శివకుమార్ విద్యా ట్రస్ట్ 46వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం చైన్నె, టీ.నగర్‌లోని అగరం ఫౌండేషన్ ఆవరణలో నిర్వహించారు. ఆయన ఈ కార్యక్రమంలో 25 మంది పేద విద్యార్ధులకు తలా రూ.10వేల చొప్పున రూ.2.25 లక్షలను సాయంగా అందజేశారు. అదేవిధంగా దిండిగల్‌లో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న తాయ్‌తమిళ్ పాఠశాలకు రూ.లక్ష, ధర్మపురి, విల్లుపురం తరువాత ప్రస్తుతం కృష్ణగిరి జిల్లా, ఆయూర్ వన ప్రాంతంలోని కొటకరైలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి అక్కడ ఉపాధ్యాయుడిని నియమించడానికి రూ.15 లక్షల నిధిని అందించారు.అదే విధంగా సీనియర్ చిత్రలేఖ కళాకారుడు మణియం సెల్వన్‌ను అభినందించి ఆయనకు రూ.లక్ష అందించారు. తిరువణ్ణామలై జిల్లా ఐవ్వారు అటవీ ప్రాంతంలో మేల్‌నెల్లిమరత్తూర్ లోని పాఠశాలాభివృద్ధి కోసం రూ.40 వేలు ఆర్థికసాయం అందించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు సూర్య, కార్తీ, శివకుమార్ విద్య ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు.