
వడచైన్నె–2లో శింబు తొలి అడుగులు
తమిళసినిమా: వైవిధ్య కథా చిత్రాల దర్శకుడు వెట్రిమారన్. సంచలన నటుడు శింబు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ వి.క్రియేషన్స్. ఈ కాంబినేషన్‌లో చిత్రం రూపొందితే ఎలా ఉంటుంది? అదిరిపోదూ! అదే జరగబోతోందిప్పుడు. వెంట్రిమారన్, శింబుల కాంబోలో చిత్రం రూపొందబోతుందన్న ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అదే సమయంలో ఈ చిత్రం డ్రాప్ అయ్యిందనే ప్రచారం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. ఇలా ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారిప్పుడు. వెట్రిమారన్, శింబుల కాంబోలో చిత్రం ఉంటుందని అధికారిక ప్రకటన వెలువడింది. గురువారం దర్శకుడు వెట్రిమారన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన శింబు హీరోగా చేసే చిత్రాన్ని వి.క్రియేషన్స్ సంస్థ అధినేత కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారని, దీనికి వడచైన్నె–2 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు ఒక ప్రోమోను విడుదల చేశారు. అందులో శింబు తొలి అడుగులు వేసి, స్లోగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఆయన నటించే 49వ చిత్రం ఇది. ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని సమాచారం. కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న 47వ చిత్రం అన్నది గమనార్హం. కాగా ఈ చిత్రం కోసం శింబు 10 రోజుల్లోనే 10 కిలోల బరువు తగ్గి స్టైలిష్‌గా తయారయ్యారట. ఇందులో ఆయన రెండు గెటప్‌లలో కనిపించనున్నట్లు తెలిసింది. ఈ చిత్ర ప్రోమో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో వడచైన్నె–2 చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి.
దర్శకుడు వెట్రిమారన్, శింబు