
వారసుడు రెడీ!
తమిళసినిమా: సినిమా చాలా పవర్‌ఫుల్ మాధ్యమం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇందులోకి ఒక్కసారి ఎంటర్ అయితే వెనక్కి వెళ్లడం అసాధ్యమనే చెప్పాలి. ఇక వారసత్వానికి పెట్టింది పేరు సినిమా రంగం. ప్రస్తుతం రాష్ట్ర క్రీడాశాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్ తెలియని వారుండరు. అయితే ఆయన రాజకీయ కుటుంబానికి చెందినా, కెరీర్ మూలాలు మాత్రం సినిమానే. తొలుత నిర్మాతగా మారి రెడ్‌జెయింట్ మూవీస్ పతాకంపై పలు భారీ చిత్రాలను నిర్మించారు. ఆ తరువాత ఆయన హీరోగా అవతారమెత్తి పలు విజయవంతమైన చిత్రాలను చేశారు. కాగా తండ్రి ఎంకే.స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉదయనిధి స్టాలిన్ సినిమాలకు స్వస్తి పలికి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలో చిత్రాలు నిర్మించడం తగ్గించారు. తాజాగా ఉదయనిధి స్టాలిన్ తన వారసుడు ఇన్బనిధిని సినీ రంగప్రవేశం చేయిస్తున్నారు. ఈయన్ని రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు సీఈఓగా నియమించారు. ఇన్బనిది రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా పంపిణీ చేస్తున్న తొలి చిత్రం ఇడ్లికడై. ధనుష్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల చేయనున్నారు. భవిష్యత్‌లో ఇన్బనిధి కూడా తండ్రి బాటలో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయి. ఆయన అందుకు తగిన శిక్షణ పొందుతున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.