
వేడుకగా ఓనం పండుగ
వేలూరు: ఓనం పండుగను పురస్కరించుకుని వేలూరు తోటపాళ్యంలోని కేరళ సమాజంలో ఆ రాష్ట్రానికి చెందిన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగవల్లులు వేసి ఘనంగా జరుపుకున్నారు. ఓనం పండుగను కేరళ సమాజం కార్యదర్శి రాధాక్రిష్ణన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కేరళ రాష్ట్రానికి చెందిన మహిళలు ఇంటిముందు సంప్రదాయ పద్ధతిలో అత్తిపూలతో ముగ్గులు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 25 రకాల ఆహార పదార్థాలు తయారు చేసి బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. మహిళలు ఓనం ఊంజల్ ఆడి, పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అలరించారు. అదే విధంగా తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లోనూ కేరళీయులు ఓనం పండుగ వేడుకలను జరుపుకున్నారు.