
ఘనంగా సర్వేపల్లి జయంతి వేడుకలు
తిరుత్తణి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వగ్రామంలో గ్రామస్తులు ఆయన జయంతి వేడుకలను వేడుకగా నిర్వహించారు. తిరుత్తణి శివారులోని వెంకటాపురంలో జన్మించిన డాక్టర్ రాధాకృష్ణన్ తిరుత్తణిలోని మర్రిమాను వీధిలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో తన ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఉన్నత విద్య అభ్యసించి, విద్యావేత్తగా, విద్యా పితామహుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఉపాధ్యాయుడిగా తన జీవిత ప్రయాణం ప్రారంభించి దేశ అత్యున్నత రాష్ట్రపతిగా సేవలందించినా ఉపాధ్యాయుడిగా చివరి శ్వాస వరకు సేవలందించారు. అతని పుట్టిన రోజును ప్రతిఏటా సెప్టెంబర్ 5న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల దినోత్సవంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులతో సత్కరిస్తున్నారు. రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా శుక్రవారం తిరుత్తణి డాక్టర్ రాధాకృష్ణన్ బాలుర మహోన్నత పాఠశాలలో కాంస్య విగ్రహానికి పాఠశాల హెచ్‌ఎం బాలసుబ్రహ్మణ్యం సహా ఉపాధ్యాయులు ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయులకు విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా వేడుకలు నిర్వహించారు. స్వగ్రామంలో జయంతి వేడుకలు వెంకటాపురం గ్రామంలో ప్రతిఏటా పుట్టిన గ్రామానికి కీర్తి తెచ్చిపెట్టిన డాక్టర్ రాధాకృష్ణన్‌కు గ్రామానికి చెందిన చంద్రన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం పరిపాటి. యథాప్రకారం గ్రామ శివారులో అలంకరించిన రాధాకృష్ణన్ చిత్రపటానికి గ్రామస్తులు ఘనంగా వాళులర్పించారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, కవితల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. గ్రామస్తులకు అన్నదానం కార్యక్రమాన్ని మండల డీఎంకే కార్యదర్శి ఆర్దిరవి ప్రారంభించారు.

ఘనంగా సర్వేపల్లి జయంతి వేడుకలు