
మీట్ ది పీపుల్ పేరిట విజయ్ పర్యటన
సాక్షి, చైన్నె: ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టనున్న తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు,సినీ నటుడు విజయ్ పర్యటనకు మీట్ ది పీపుల్ అన్న పేరును ఎంపిక చేసి ఉన్నారు. తిరుచ్చి నుంచి ఈ పర్యటనకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమిళగ వెట్రికళగంతో గత ఏడాది రాజకీయాలలోకి వచ్చిన విజయ్ ఈ ఏడాది తన కార్యచరణను విస్తృతం చేసుకున్నారు. పార్టీ తరపున రెండు మహానాడులను జయప్రదం చేసుకున్నారు. గత వారంమదురైలోజరిగిన మహానాడులో ప్రజలలోకి వస్తున్నట్టు ప్రకటించారు. ప్రజా క్షేత్రం నుంచి ఇక డీఎంకే, బీజేపీలకు ప్రశ్నలను సంధించనున్నట్టు ఽ వ్యాఖ్యలు చేశారు. అలాగే తన పర్యటన భిన్నంగా ప్రజలతో మమేకం అయ్యే విధంగానే ఉంటుందని, పూర్తిగా ఇది ప్రజా పర్యటనగా మారుతుందని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఈనెల 15 లేదా 17 తేదీలలో పర్యటనకు విజయ్ సన్నద్ధం అవుతున్నట్టు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. ఈ పర్యటనకు సంబంధించి గత రెండు రోజులుగా జిల్లాల కార్యదర్శులతో విస్తృతంగా సమావేశాలు పనయూరులోని పార్టీ కార్యాలయంలో జరుగుతూ వస్తున్నాయి. ఈ మేరకు ఉత్తర తమిళనాడులోని విల్లుపురంలో తొలి మహానాడు, కొంగు మండలం కోయంబత్తూరులో బూత్ కమిటీ మహానాడు, దక్షిణ తమిళనాడులో ప్రధాన కేంద్రంగా ఉన్న మదురైలో రెండో మహానాడు విజయవంతం చేసుకున్న నేపథ్యంలో ప్రజలలోకి చొచ్చుకెళ్లే ఈ యాత్రకు మీట్ ది పీపుల్ అని నామకరణం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాడులో సెంట్రల్ భాగంగా ఉన్న తిరుచ్చి నుంచి ఈ యాత్ర మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. తొలి విడతగా 10 జిల్లాలో విజయ్ పర్యటనకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి ఉన్నట్టుగా చెబుతున్నారు. అలాగే, విజయ్ యాత్రకు ప్రత్యేక ప్రచార రథం సిద్ధం చేసి ఉన్నట్టు, ఒకటి రెండు రోజులలో ఇది పనయూరుకు చేరుకోబోతున్నట్టు ఓ నేత పేర్కొన్నారు.