
ఎడపాడి మాటలకు సమాధానం చెప్పలేం
వేలూరు: ఎడపాడి పళనిస్వామి దిగజారుడు మాటలకు సమాధానం చెప్పలేమని మంత్రి దురైమురుగన్ అన్నారు. వేలూరులోని కొత్త బస్టాండ్‌లో ప్రభుత్వ ఏసీ బస్సులను కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మారుమూల ప్రాంతాలకు సైతం తమ ప్రభుత్వంలోనే తారు రోడ్డు వేయడంతో పాటు బస్ సౌకర్యం కల్పించామన్నారు. ప్రస్తుతం ఏడు మార్గాల్లో రూ.3.43 కోట్ల విలువచేసే ఏడు బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు సౌకర్యంగా ఏసీ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏసీ బస్సుల వసతి కల్పించామన్నారు. వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని, వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్, జోన్ చైర్మన్ వీనస్ నరేంద్ర, కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మణ్, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.