
కొత్త పేపర్ వేరియంట్‌ల ఆవిష్కరణ
కొరుక్కుపేట: ఆసియాలోనే అగ్రగామి కాగిత తయారీదారుగా కొనసాగుతున్న తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ (టీఎన్‌పీఎల్) సాంకేతిక పురోగతులు, పర్యావరణ అనుకూల పద్దతుల ద్వారా విస్తృత శ్రేణి కాగితపు గ్రేడ్‌లను ఉత్పత్తి చేయడానికి అనేక ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీఎన్‌పిఎల్ అదనపు ప్రదాన కార్యదర్శి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ సక్సేనా తిరుచ్చిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఇంప్రూవ్డ్ టీఎన్‌పీఎల్ కాపీయర్ పేపర్‌ను ప్రారంభించారు. అలాగే శివకాశిలో జరిగిన కార్యక్రమంలో వివిడ్‌ప్రింట్ (56 జీఎస్‌ఎం) అనే కొత్త ప్రింటింగ్ అండ్ రైటింగ్ పేపర్ వేరియంట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఎన్‌పీఎల్ అనేది 40 సంవత్సరాలకుపైగా కాగితం, సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తున్న ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ సంస్థ అని అన్నారు. భారతదేశంలో అనేక పేపర్ మిల్లులు ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు పనిచేయడంలేదని వీటికి భిన్నంగా టీఎన్‌పీఎల్ ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు.