
సమష్టి కృషితోనే దేశాభివృద్ధి
● వీఐటీ వ్యవస్థాపక చాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్ ● వీఐటీ చైన్నెలో వికసిత్ భారత్ సదస్సు ప్రారంభం
కొరుక్కుపేట: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరులు కలసి వచ్చి దేశనిర్మాణానికి, ఆర్థికాభివృదికి దోహదపడాలని వీఐటీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక చాన్స్‌లర్ డాక్టర్ జి.విశ్వనాథన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు చైన్నె కేలంబాక్కం సమీపంలోని వీఐటీ చైన్నె లో రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్ పేరుతో రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన అనంతరం వీఐటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీ సెల్వం స్వాగతోపన్యాసం చేశారు. తేటా, ఏబిఆర్‌ఎస్‌ఎంతో కలసి వీఐటీ చైన్నె క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ రెండు రోజుల జాతీయ సదస్సుకు దేశంలోని 20 రాష్ట్రాలలోని ఉన్నత విద్యా సంస్థలు నుంచి 1200 మంది ప్రతినిధులు, పరిశోధకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ ఆర్ మణికంఠన్ కన్వీనర్ నివేదికను సమర్పించారు. అనంతరం వీఐటీ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక ఛాన్సులర్ డాక్టర్ జి. విశ్వనాథన్ విదేశీ వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా అతిథులు ఘనంగా సత్కరించారు. దీనిపై స్పందించిన విశ్వనాథన్ సభను ఉద్దేశించి మాట్లాడారు.
180 మంది విద్యార్థులతో ప్రారంభమై..
180 మంది విద్యార్థులతో ప్రారంభించిన విఐటీ విద్యాసంస్థ నేడు మహావృక్షంగా పెరిగి 25 వేల మందికి పైగా విద్యార్థులు కలిగి ఉందని , వివిధ దేశాల ఉన్నత విద్యాసంస్థలతో అవగాహన ఒప్పందాలు మేరకు విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్ది దేశానికి అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ,ప్రభుత్వాలు, పౌరులు కలసి కట్టుగా పనిచేస్తే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. భారతదేశ బడ్జట్‌లో కేవలం 2 శాతం మాత్రమే విద్య కోసం ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు. ఎంపీ ప్రొఫెసర్ డాక్టర్ సుదాన్షు త్రివేది మాట్లాడుతూ ప్రదాని నరేంద్ర మోడి సమర్థనాయకత్వంలో భారతదేశంలో ఆర్థికాభివృద్దికి నాంది పలుకుతోందన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ పీజీ సీతారామ్ మాట్లాడుతూ ప్రస్తుత యుగం స్వర్ణయుగం అని పేర్కొంటూ మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ దూర దృష్టితో జాతీయ ఉద్యమంగా పరిగణించారని అన్నారు. ఏవీఆర్ ఎస్ మీనాక్షి మహిళా కళాశాల కార్యదర్శి డాక్టర్ కేఎస్ లక్ష్మి, ఆల్ ఇండియా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంతా లక్ష్మణ్, తెటా ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ భాస్కర్, హైదరాబాద్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సయ్యద్ హనీల్ హసన్, కోవై లోని రత్నం విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మదన్ సెంథిల్, ప్రొఫెసర్ పంచరత్నం, డాక్టర్ త్యాగరాజన్ పాల్గొన్నారు.