
క్లుప్తంగా
ఎలుగుబంటి దాడి
–వ్యాపారికి గాయాలు
వేలూరు: ఎలుగుబంటి దాడిలో ఓ వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని యలగరి కొండపై 14 గ్రామాల ప్రజలు నివసిస్తున్నారు. వక్కణం బట్టి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్నాడు శుక్రవారం సాయంత్రం వ్యాపారం పూర్తిచేసుకుని సాయంత్రం ఏడు గంటల సమయంలో బైక్‌లో సొంత గ్రామానికి బయలుదేరాడు. కొండపై ఉన్న 10వ మలుపులో వెళుతుండగా ఏలుగుబంటి ఇతనిపై దాడి చేసింది. బైక్‌పై ఉన్న కృష్ణమూర్తి కింద పడిపోయాడు. అయినా ఎలుగుబంటి వదలకుండా దాడి చేస్తుండడంతో సహ వాహనదారులు వెంటనే కరల్రు, రాళ్లతో తరిమివేసి కృష్ణమూర్తిని కాపాడారు గాయపడ్డ అతన్ని పోలీసులు తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య
తిరువళ్లూరు: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సేలం జిల్లా తిరుమనూర్ వాళపాడి గ్రామానికి చెందిన జయప్రకాష్. ఇతని భార్య కలైవాణి(34). వీరికి తరుణ్(09), కృత్తిక(03) అనే ఇద్దరు పిల్లలు వున్నారు. ఇతనికి ఆర్‌బీఎల్ బ్యాంకు మధురవాయల్ బ్రాంచ్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబాన్ని పులియూర్‌లో వుంచి రోజూ ఆఫీస్‌కు వెళ్లేవాడు. ఈక్రమంలో ఇటీవల సంబంధిత బ్యాంకులో ఉద్యోగానికి రాజీనామ చేసి కడలూరులోని ఈఎస్‌ఏఎఫ్ బ్యాంకులో చేరినట్టు తెలిసింది. అక్కడి నుంచి వారానికి రెండు రోజులు మాత్రమే ఇంటికి వచ్చేవాడు. ఈక్రమంలో కలైవాణి శనివారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు వివాహితను కిందికి దింపి వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. భర్త ఇచ్చిన పిర్యాదు మేరకు వెంగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తుతెలియని
మృతదేహం లభ్యం
తిరువళ్లూరు: తిరువళ్లూరు సమీపంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా కొట్టయూర్ సమీపంలోని కాలువలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం వున్నట్టు వీఏఓ తంగరాజ్, మప్పేడు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు, రెవెన్యూ అధికారులు మృతదేహాన్ని తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు శవపరిక్ష నిమిత్తం తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి వున్న క్రమంలో హత్య చేసి ఎవరైనా పడేశారా అనే కోణంలో మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌ను ఢీకొన్న వ్యాన్
– ఇద్దరి మృతి
తిరువొత్తియూరు: కడలూర్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. వివరాలు..కడలూరు పుదుక్కడై ప్రాంతానికి చెందిన 10 మందికి పైగా వ్యక్తులు పాండిచ్చేరి నుంచి ధర్మపురి జిల్లాలోని హోగెనక్కల్ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. అక్కడ యాత్ర ముగించుకుని శుక్రవారం రాత్రి తిరిగి కృష్ణగిరి జిల్లా, ఊతంగరై మీదుగా తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ఊతంగరై సమీపంలోని చోళక్కపట్టు క్రాసింగ్ వద్దకు వెళుతుండగా, ఎదురుగా వస్తున్న వ్యాన్ అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం చూసిన ఆ మార్గంలో వెళ్తున్న వారు దిగ్భ్రాంతి చెందారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న తిరుపత్తూరు జిల్లా, కందిలి ప్రాంతానికి చెందిన నటరాజ్ కుమారుడు ప్రకాష్ ( 28) జ్ఞానశేఖరన్ కుమారుడు లక్ష్మణన్ (27) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఊతంగరై పోలీసులు ఇద్దరి మృతదేహాలను ఊతంగరై ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఇదిలా ఉండగా, మినీ వ్యాన్ డ్రైవర్, కడలూరు జిల్లా, పుదుక్కడై ప్రాంతానికి చెందిన రాజగోపాల్ కుమారుడు దక్షణామూర్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మేకను మింగేందుకు
కొండచిలువ యత్నం
తిరువొత్తియూరు: మేక పిల్లను కొండచిలువ మింగేందుకు యత్నించింది. కోయంబత్తూర్ జిల్లాలోని మేట్టుపాళయం సమీపంలోని మూలత్తురై గ్రామం భవానీ నది ఒడ్డున ఉంది. ఈక్రమంలో అక్కడ మేతకు వెళ్లిన 6 నెలల మేక పిల్లను ఓ కొండచిలువ మింగడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో మేక పిల్ల అరుపులు విని అక్కడి స్థానికులు కొండచిలువ నుంచి మేకపిల్లను రక్షించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.