
క్లుప్తంగా
ఎస్పీ బాధ్యతల స్వీకరణ
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా నూతన ఎస్పీగా వివేకానంద శుక్లా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్పీగా వున్న శ్రీనివాసపెరుమాల్‌ను సీఐడీ ఎకనమిక్ వింగ్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం రాణిపేట జిల్లా ఎస్పీగా ఉన్న వివేకనందశుక్లాను తిరువళ్లూరు జిల్లాకు బదిలీ చేశారు. దీంతో వివేకానందశుక్లా గురువారం ఎస్పీ కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు పోలీస్ అధికారులు అభినందలు తెలిపారు. కాగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే గుమ్మిడిపూండి చెక్‌పోస్టును తనిఖీ చేశారు. జిల్లాకు శుక్లా 23వ ఎస్పీ కాగా, రెండేళ్ల క్రితం శుక్లా తిరువళ్లూరు అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. కాగా ఆవడి డిప్యూటీ కమిషనర్‌గా వున్న ఐమన్ జమాల్ రాణిపేట జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు.
సీబీఐ విచారణకు నిరాకరణ
సాక్షి, చైన్నె : మదురై కార్పొరేషన్‌లో పన్నుల వసూళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు కోర్టు నిరాకరించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. మదురై కార్పొరేషన్‌లో అక్రమలు అంటూ వచ్చి ఆరోపణల వ్యవహారం మధురై ధర్మాసనంకు చేరింది. ఈ కేసు సీబీఐకు అప్పగించాలని పిటిషనర్లు విన్నవించారు. విచారణ ముగియడంతో సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమిస్తూ హైకోర్టు మధురై ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
గొంతు కోసి యువకుడి హత్య
అన్నానగర్: చిన్నసేలం సమీపంలో ఓ యువకుడిని గొంతు కోసి హత్య చేసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. కళ్లకురిచ్చి జిల్లాలోని చిన్నసాలెం సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో నివసిస్తున్న మారిముత్తు (55). ఇతని భార్య పచ్చైయమ్మల్ (50). వీరికి తవాసి (23), భాస్కర్ (19) ఇద్దరు కుమారులు ఉన్నారు. తవాసి కళ్లకురిచ్చిలోని ఒక కసాయి దుకాణంలో పనిచేసేవాడు. భాస్కర్ పశువుల వ్యాపారిగా పనిచేసేవాడు. వీరి తల్లిదండ్రులు వారికి చెందిన ఇంట్లో నివసించేవారు. సోదరులు తవాసి, భాస్కర్ సాధారణంగా రాత్రిపూట గ్రామంలోని ఇంట్లో నిద్రపోతారు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి, వారిద్దరూ పొలంలోని ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసి, నిద్రించడానికి గ్రామంలోని ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంలో గురువారం ఉదయం, భాస్కర్ మెడ తెగిపోయి రక్తస్రావంతో ఇంట్లో చనిపోయి కనిపించాడు. అతని సోదరుడు తవసి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం కల్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భాస్కర్ సోదరుడు తవాసి కోసం వారు తీవ్రంగా వెతుకుతున్నారు. ఈ ఘటన కళ్లకురిచ్చి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ఆక్రమణల తొలగింపు
తిరుత్తణి: కేజీ.కండ్రిగ నొచ్చిలి క్రాస్ వద్ద నెలకొన్న వాహనాల రద్దీ ప్రమాదాల పరిష్కారానికి వీలుగా ఆక్రమణలు తొలగింపు పనులు హైవే శాఖ అధికారులు చేపట్టారు. తిరుత్తణి నుంచి చిత్తూరు వెళ్లే హైవే రోడ్డులో కేజీ.కండ్రిగలో వాహనాల రద్దీని నియంత్రించే విధంగా రూ.26 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేజీ.కండ్రిగలోని నొచ్చిలి క్రాస్‌లో హైవే రోడ్డును దుకాణాదారులు ఆక్రమించుకోవడంతో నిత్యం వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో హైవే శాఖ నొచ్చిలి రౌండ్ ఠాణా వద్ద రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
కంటైనర్‌ను ఢీకొన్న కారు
తిరుత్తణి: దైవదర్శనం చేసుకుని ఇంటికి వెళుతూ ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు టైర్ పేలడంతో కంటైనర్‌ను ఢీకొని దంపతులతోపాటు కుమారుడు దుర్మరణం చెందారు. ఈఘటన అరక్కోణం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. అరక్కోణంకు చెందిన వెంకటేశన్(45) కారు మెకానిక్. ఇతని భార్య లత. వీరికి ఇద్దరు కుమారులు. వారిలో దినేష్(17)ప్లస్‌టూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆడి నెల మొదటిరోజు సందర్భంగా వెంకటేష్, లత, దినేష్‌తో కలిసి కారులో కాంచీపురంలోని కామాక్షమ్మ ఆలయానికి గురువారం ఉదయం వెళ్లారు. స్వామి దర్శనం చేసుకుని మధ్యాహ్నం ఇంటికి బయలుదేరారు. కాంచీపురం–అరక్కో ణం రోడ్డులోని నెమిలి వద్ద కారు ముందు టైర్ పేలి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొంది. ప్రమాదంలో వెంకటేశన్ మృతిచెందాడు. గాయపడ్డ భార్య, కుమారుడిని అరక్కోణం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లత, దినేష్ మృతిచెందారు. నెమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

క్లుప్తంగా

క్లుప్తంగా