
సూపర్ చైన్నె లక్ష్యంగా డిజిటల్ ఉద్యమం
సాక్షి, చైన్నె : సూపర్ చైన్నె లక్ష్యంగా ప్రత్యేక్ష ప్రసారాల కోసం వెబ్‌సైట్‌ను గురువారం ఆవిష్కరించారు. ఇది పట్టణానికి సంబంధించిన కథను చెప్పేడమే కాకుండా, భాగస్వామ్య సంస్కృతి, నగర బ్రాండింగ్‌లో ఒక పెద్ద ముందడుగు అని సూపర్ చైన్నె ఎండీ రంజీత్ డి రాథోడ్ తెలిపారు. గురువారం స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పౌరుల నేతృత్వంలో సాగే ఒక డిజిటల్ ఉద్యమంగా ఈ వేదిక ఉంటుందన్నారు. సూపర్ చైన్నె అన్నది కమ్యూనిటీ స్వరాలు, నవీకరణ, సాంస్కృతిక కథనాల ఏకీకృత డిజిటల్ వేదికగా నిలుస్తుందన్నారు. దీనికి క్రెడాయ్ చైన్నె మద్దతు ఇస్తున్నదని, సాంకేతిక నిపుణులు, పౌరులు, వ్యవస్థాపకులు,కళాకారులు, తమ వంతు సహకారంతో ముందడుగు వేస్తున్నారన్నారు.ఫెయిర్ ప్రో 2025లో సీఎం స్టాలిన్ సూపర్ చైన్నె లోగోను ఆవిష్కరించారని గుర్తు చేస్తూ ఇప్పుడు చైన్నె ను మెట్రోగా మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నగరంగా ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ డిజిటల్ వేదిక ముందుకెళ్లనున్నట్టు వివరించారు. పాయింట్ కాస్ట్ బ్రాండ్ ఎవాంజెలిస్టు ఆదిత్య స్వామినాథన్ మాట్లాడుతూ, నగరానికి హృదయ స్పందనను అందించే మార్గంగా పాయింట్ కాస్ట్ ఈ వేదిక ద్వారా ప్రజలకు కొత్త అనుభూతిని అందించనున్నట్టు వివరించారు. సూపర్‌చైన్నె ఐకాన్ ఆఫ్‌ది మంత్ అనే నెలవారీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిందని, ఇది సమాజం, ప్రజల పట్ల ఐకానిక్ ధృక్పథం ఉన్న వారిని గుర్తించి వెలుగులోకి తెచ్చి, అవార్డులను అందజేయనున్నట్టు ప్రకటించారు. ఐకాన్ ఆఫ్‌ది మంత్‌గా తొలి అవార్డును అందుకున్న నేచురల్ సెలూన్ సహ వ్యవస్థాపకుడు సీకే కుమర వేల్ మాట్లాడుతూ, చైన్నె తనను తీర్చిదిద్దిందని, మద్దతు ఇచ్చిందని, స్పూర్తినిచ్చిందని వ్యాఖ్యలు చేశారు. క్రెడాయ్ చైన్నె అధ్యక్షుడు ఎ మహ్మద్ అలీ మాట్లాడుతూ, చైన్నె నగరం సూపర్ చైన్నెగా పెట్టుబడులు, ఆవిష్కరణలకు అత్యంత శక్తివంత గమ్యస్థానాలలో ఒకటిగా, డిజిటల్ ఔట్రీచ్, మీడియా సహకారం, ఆన్ గ్రౌండ్ యాక్టివేషన్ల మిశ్రమం ద్వారా సాంస్కృతిక గొప్పతనం, ఆర్థిక అవకాశాలు, భవిష్యత్తును చాటనున్నామన్నారు.