
సెప్టెంబర్ 4న మదురైలో బల నిరూపణ
– పన్నీరు శిబిరం నిర్ణయం
సాక్షి, చైన్నె: మాజీ సీఎం పన్నీరు సెల్వం సెప్టెంబర్ 4న మదురై వేదికగా తన బలాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించినానంతరం ఆ పార్టీని కై వసం చేసుకునేందుకు పన్నీరు సెల్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ కూటమితో ఎన్నికలను ఎదుర్కొన్న పన్నీరు సెల్వంకు తాజాగా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీతో అన్నాడీఎంకే చేతులు కలిపిన నేపథ్యంలో తదుపరి రాజకీయ ప్రత్యామ్నాయం మీద పన్నీరు శిబిరం దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సోమవారం చైన్నెలో మద్దతుదారులతో పన్నీరు సెల్వం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పార్టీ సమావేశంలో బలాన్ని చాటే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మద్దతు దారులను ఏకం చేయడం, కార్యక్రమాలను విస్తృతం చేయడంతోపాటుగా సెప్టెంబర్ 4వ తేదీన మదురై వేదికగా బల నిరూపణ దిశగా భారీ కార్యక్రమానికి తీర్మానించారు. ఇక్కడ జరిగే భారీ కార్యక్రమంలో తమ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను చాటే దిశగా ముందుకెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధంచేశారు. మీడియా సంధించిన ప్రశ్నకు పన్నీరు సెల్వం సమాధానం ఇస్తూ అన్నాడీఎంకే నుంచి ఆహ్వానం వస్తే చేరేందుకు సిద్ధమన్నారు. తనకు ఏ పదవీ వద్దు అని కార్యకర్తగా పనిచేయడానికి రెడీ అని సమాధానమిచ్చారు.
గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ
తిరుత్తణి: కొండజాతి ప్రజలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజలో ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని, పనులకు శ్రీకారం చుట్టారు. తిరుత్తణి యూనియన్ బీరకుప్పం పంచాయతీలో కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొండజాతి ప్రజల గ్రామానికి గతవారం వెళ్లి, రాత్రికి అక్కడే బస చేసే వారి కష్టాలు, కనీస అవసరాలు తెసుకుని వారికి సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వెను వెంటనే తాగునీరు. విద్యుత్, రోడ్లు సౌకర్యాల కల్పనకు అధికారులను రంగంలోకి దింపారు. వెను వెంటనే విద్యుత్, తాగునీరు, రోడ్డు సౌకర్యాలు కల్పించారు. దీంతో పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న 15 కుటుంబీకులకు పక్కా ఇళ్లు రూ.4.50 లక్షల చొప్పున నిర్మించేందుకు ఎయిడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. సోమవారం నిర్వహించిన భూమిపూజలో ఎయిడ్ ఇండియా సంస్థ నిర్వాహకులతోపాటు ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూమిపూజ ప్రారంభించారు. అలాగే చిన్నారులకు సాయంత్రం సమయాల్లో ట్యూషన్ తరగతుల కోసం గది సైతం నిర్మించనున్నట్లు తెలిపారు. కొండజాతి ప్రజల సమస్యలు వెను వెంటనే పరిష్కరించి, ఇళ్లు నిర్మాణానికి సైతం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
వేలూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ అందజేసే బాధ్యత సర్పంచ్‌లపై ఉందని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు జిల్లా కన్నియంబాడి యూనియన్ పరిధిలోని కమ్మవాన్‌పేట గ్రామ పంచాయతీలో అన్నా మరుమలర్చి పథకం కింద రూ. 45.65 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.