
భక్తజన సాగరం.. తిరుప్పరకుండ్రం
సాక్షి,చైన్నె: తిరుప్పరకుండ్రంలో మహాకుంభాభిషేక వేడుక సోమవారం ఘనంగా జరిగింది. భక్త జనుల హరోం హర నామస్మరణ నడుమ మహోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలోని మురుగన్ ఆరుపడై వీడులలో మొదటి ఆలయంగా తిరుప్పరకుండ్రంప్రసిద్ది చెందిన విషయం తెలిసిందే.ఇక్కడ గత కొన్నేళ్ల అనంతరం మహాకుంభాభిషేకానికి హిందూ, దేవాదాయ శాఖ చర్యలు తీసుకుంది. గత వారం రోజులుగా యాగ శాలలో పూజలు నిర్వహిస్తూ వచ్చారు. ఆదివారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఆలయం ఆవరణలో భక్తుల హరోం..హర నామస్మరణ మార్మోగింది. ప్రత్యేక యాగాలు, పూజలు జరిగాయి. సోమవారం వేకువ జామున మూడున్నర గంటల నుంచి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 4.30 గంటలకు యాగశాల నుంచి పవిత్ర జలాలను కలశాలలో ఉంచి రాజగోపురం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉదయం 5.25 గంటలకు రాజగోపురంలోని 7 కలసాలకు పవిత్ర అభిషేకాలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని మంత్రులు శేఖర్ బాబు, మూర్తిలు జెండా ఊపి ప్రారంభించారు. సరిగ్గా 6.10 గంటలకు మురుగన్ సన్నిధిలో మహాకుంభాభిషేకం జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున జన సందోహం తిరుప్పర గుండ్రంకు తరలి రావడంతో ఆ పరిసరాలు హరోం..హర నామస్మరణలో మునిగాయి. ఈ ఉత్సవం నిమిత్తం మధురై నుంచి మీనాక్షిఅమ్మవారు, సుందరేశ్వర స్వామి వారు తరలి రావడం విశేషం. స్వామి అమ్మవార్లను, వళ్లి దేవానై సమేత మురుగన్‌ను భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. మహోకుంభాషేకానికి తరలి వచ్చిన భక్తులపై డ్రోన్ల ద్వారా పవిత్ర జలాలను చల్లారు. భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు.
● ఘనంగా మహా కుంభాభిషేకం
జెండా ఊపుతున్న మంత్రులు శేఖర్‌బాబు, మూర్తి

భక్తజన సాగరం.. తిరుప్పరకుండ్రం