
2026లో అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు తథ్యం
సాక్షి, చైన్నె: 2026లో అన్నాడీఎంకే ప్రభుత్వం తమిళనాడులో ఏర్పాటు అవుతుందని , ఇందులో ఎలాంటి మార్పు లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిపళణి స్వామి స్పష్టం చేశారు. సంపూర్ణ మెజారిటీతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు, ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళణి స్వామి ప్రజా చైతన్య యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం కడలూరులో ఆయన ఆలయంలో పూజలతో పర్యటన మొదలెట్టారు. ముందుగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందంటూ కూటమి పాలనకు , సంకీర్ణ ప్రభుత్వానికి ఆస్కారం లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. తామే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీతో జాతీయస్థాయిలో తాము పొత్తు పెట్టుకున్నామని పేర్కొంటూ, అన్నాఎంకే నేతృత్వంలోనే తమిళనాడులో కూటమి అన్నది స్పష్టం చేశారు. మీతోస్టాలిన్ కార్యక్రమం ఓ నాటకం అని,ప్రజల సెల్‌నెంబర్లన్నీ అధికారుల ద్వారా దొంగలించి డీఎంకే ఐటీ విభాగానికి ఎన్నికల సమయంలో అప్పగించేందుకే ఈ కొత్త పబ్లిసిటీ అంటూ ఆరోపణలు చేశారు.