
ప్రధాని పర్యటనకు తిరుచ్చిలో ఏర్పాట్లు
సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై దృష్టి పెట్టే విధంగా బుధవారం తిరుచ్చి విమానాశ్రయం, పరిసరాలలో భద్రతా రిహార్సల్స్ జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 27,28 తేదీలలో అరియలూరు, పెరంబలూరు,తంజావూరు జిల్లాలో పర్యటించేందుకు నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డ విషయం తెలిసిందే. అయితే అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన భద్రత కు సంబంధించిన కసరత్తులు మొదలైనట్టున్నాయి. ఇందుకు అనుగుణంగా తిరుచ్చి విమానాశ్రయం, పరిసరాలలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన రిహార్సల్స్ జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం వర్గాలు, పీఎం భద్రతా విభాగం వర్గాలు, తిరుచ్చి పోలీసు యంత్రాంగంతోపాటూ పెరంబలూరు, అరియలూరు జిల్లాల పోలీసు అధికారులు ఈ భద్రతా రిహార్సల్స్‌కు హాజరయ్యారు. అలాగే ఆయా ప్రాంతాలలో చేపట్టాల్సిన భద్రత గురించి సమీక్షించినట్టు సమాచారాలు వెలువడ్డాయి.