
శివకాశిలో మెరుపు సమ్మె!
సాక్షి, చైన్నె : విరుదు నగర్‌లో జిల్లాలో ఇక మీదట ఒక్క బాణసంచా ప్రమాదం జరగడానికి వీలు లేదని గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించిన నేపథ్యంలో బాణసంచా పరిశ్రమల యాజమాన్యాలు అలర్ట్ అయ్యాయి. అధికారుల తనిఖీలకు భయపడి మెరుపు సమ్మె అంటూ బాణసంచా పరిశ్రమలను సోమవారం మూసి వేశారు. వివరాలు.. విరుదునగర్ జిల్లా శివకాశి, సాత్తూరు పరిసరాలు బాణా సంచాల తయారీకి ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రజలకు వందలాదిగా ఉన్న బాణసంచా పరిశ్రమలలో కూలి పనులే దిక్కు. అదే సమయంలో నిత్యం ఇక్కడ ప్రమాదాలు సైతం తప్పడం లేదు. ఈ ఆరు నెలలో సుమారు 10కి పైగా ప్రమాదాలు జరిగాయి. దీపావళి సమీపించే కొద్ది మరిన్ని ప్రమాదాలు తప్పదేమో అన్న ఆందోళన నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో గతవారం ఈ ప్రమాదాలపై దక్షిణ భారత గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. విరుదునగర్ జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ఒక్కటంటే ఒక్క ప్రమాదం జరగడానికి వీలు లేదని హెచ్చరించింది. పది రోజులలలో ఇక్కడున్న అన్ని పరిశ్రమలలో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక బృందం, పేలుడు పదార్థాల క్రమబద్ధీకరణ విభాగం అధికారులతో కూడిన మరో బృందం తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఇక్కడ కార్మికులకు ఉన్న భద్రత, ప్రమాదాలకు ఆస్కారం ఇవ్వకుండా చేపట్టిన చర్యలను సమగ్రంగా పరిశీలించి నివేదికలను సమర్పించాలని ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం నుంచి అధికారులు రంగంలోకి దిగారు. పరిశ్రమలలో తనిఖీలపై దృష్టి పెట్టారు.అ దే సమయంలో సుమారు 200 పరిశ్రమలు సోమవారం మూసి వేశారు. తమ డిమాండ్‌ల పరిష్కారం అంటూ ఆయా సంస్థలు సమ్మెనినాదం అందుకున్నాయి. దీంతో అక్కడి కార్మికులు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి. రోజు వారీ కూలీలనిమ్తితం పనులకు వచ్చేవారిలో ఆందోళన బయలుదేరింది. కాగా, అధికారుల తనిఖీలకు భయపడే ఈ నాటకం ఆడుతున్నారన్న ఆరోపణలు బయలుదేరాయి. భద్రతా పరంగా ఎలాంటి చర్యలు లేని దృష్ట్యా, సమ్మె గంట అంటూ ఆయా పరిశ్రమలు మూసి వేసినట్టుగా సమాచారాలు వెలువడ్డాయి.
అధికారులకు భయపడి మూత