క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jul 15 2025 6:47 AM | Updated on Jul 15 2025 6:47 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

నమ్మ హెల్త్‌ కార్డ్‌ ఆవిష్కరణ

సాక్షి, చైన్నె: ఎంజీఎం హెల్త్‌ కేర్‌ నేతృత్వంలో నమ్మ హెల్త్‌ కార్డ్‌ను రూపకల్పన చేశారు. మహిళలకు ప్రత్యేకంగా ఉచిత మాస్టర్‌ హెల్త్‌ చెక్‌తోపాటూ ఆరు ప్రత్యేక ప్రయోజనాలను ఈ కార్డు ద్వారా కల్పించనున్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ కార్డును అన్నా నగర్‌ డిప్యూటీ పోలీసు కమిషనర్‌ బి. స్నేహప్రియ ఆవిష్కరించారు. ఎంజీఎం హెల్త్‌ కేర్‌ ఎండీ డాక్టర్‌ ప్రశాంత్‌ రాజగోపాలన్‌ కార్డును అందుకున్నారు. ఈ కార్డు ప్రయోజనాల గురించి డాక్టర్‌ ప్రశాంత్‌ వివరిస్తూ ఈ కార్డు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా పేర్కొన్నారు. కార్డు దారులకు ప్రత్యేక ప్రయోజనాలుగా ఔట్‌ పేషెంట్‌ కన్సల్టేషన్‌, డయాగ్నస్టిక్‌ పరీక్షలు, ఫార్మసీ బిల్లులు, ప్రీమియం హెల్త్‌ చెక్‌ ప్యాకేజీలపై భారీ తగ్గింపు కల్పిస్తున్నామన్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఉచిత మాస్టర్‌ హెల్త్‌చెక్‌ చేయనున్నామన్నారు. తమ హెల్త్‌ కేర్‌ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ప్రయోజనాలతోపాటుగా 10 కి.మీ దూరం పరిధిలో ఉచిత అంబులెన్స్‌ సేవలకు శ్రీకారం చుట్టామన్నారు.

యువకుడి హత్య కేసులో నలుగురి అరెస్టు

తిరువొత్తియూరు: పుట్టినరోజు వేడుకలకు స్నేహితుడిని తీసుకెళ్లి కత్తులతో దాడి చేసి హత్య చేసిన నలుగురు స్నేహితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన చైన్నెలోని వ్యాసర్పాడి ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చైన్నె వ్యాసార్పాడి ఎంకేబీనగర్‌కు చెందిన పుదు నగర్‌ 7వ వీధిలోని కుమార్‌, చిత్ర దంపతుల కుమారుడు శంకర్‌(19), కుమార్తె వనిత(17) ఉన్నారు. శంకర్‌ సైదాపేట కళాశాలలో చదువు మధ్యలో మానేసి, మెకానిక్‌ పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతని పుట్టినరోజు కావడంతో అతనితో పాటు కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఆదివారం సాయంత్రం వచ్చి కేక్‌ కట్‌ చేసేందుకు శంకర్‌ను తీసుకెళ్లారు. దీని తర్వాత వారు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. తరువాత ఎరుకంచెరి ప్రాంతంలోని గ్రౌండ్‌లో అందరూ ఫుట్‌బాల్‌ ఆడారు. ఆ సమయంలో హఠాత్తుగా శంకర్‌కు అతని స్నేహితుడు ధనరాజ్‌ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీంతో స్నేహితులు కలిసి శంకర్‌పై కత్తులతో దాడి చేసి పారిపోయారు. తీవ్రగాయాల పాలైన శంకర్‌ అదే చోట మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న కొడుంగైయూర్‌ ఇన్‌స్పెక్టర్‌ శరవణన్‌ నేతృత్వంలోని పోలీసులు సోమవారం ఉదయం వెళ్లి శంకర్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ధనరాజ్‌, విజయ్‌, లింగేష్‌, నితిన్‌ అనే నలుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

గుండెపోటుతో వరుడి మృతి

తిరువొత్తియూరు: చైన్నె, కీలాంబాకం ప్రాంతంలో సినిమా చూస్తున్న సమయంలో నవ వరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. చైన్నె మందవెలి ఎస్‌బీఐ కాలనీకి చెందిన మెల్లివిన్‌(29) ఎగ్మోర్‌లోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య గాయత్రి. వీరికి ఒక నెల క్రితం వివాహం జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో నూతన వధూవరులు మోటార్‌ సైకిల్‌పై కీలంబాక్కం దగ్గర ఓఎంఆర్‌ రోడ్డులో ఉన్న షాపింగ్‌ మాల్‌కి వెళ్లారు. అక్కడ షాపింగ్‌ చేసి, థియేటర్‌లో సినిమా చూస్తున్నారు. సినిమా చూస్తున్నప్పుడు మెల్లివిన్‌కు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. దీంతో షాక్‌ అయిన గాయత్రి థియేటర్‌లో ఉన్నవారి సహాయంతో తన భర్తను చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మెల్లివిన్‌కు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. ఇది విన్న గాయత్రి బోరుమని విలపించారు. దీనిపై సమాచారం మేరకు కీలంబాక్కం పోలీసులు అక్కడికి చేరుకుని మెల్విన్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. మెల్విన్‌ గుండె పోటుతో మృతి చెందాడా లేక మాల్‌కు వచ్చినప్పుడు అతను ఎలాంటి ఆహారం తిన్నాడు, ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగిందా అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నివేదిక ఫలితాల ఆధారంగా తదుపరి దశ దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.

యువకుడి హత్య

తిరువొత్తియూరు: స్థలం విషయంలో జరిగిన వివాదంలో గునపంతో దాడి చేసి యువకుడిని హత్య చేసిన తండ్రీకొడుకులను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా కుంభకోణంబందనల్లూర్‌ వేడమంగళం సౌత్‌ రోడ్‌కు చెందిన బాలయ్య అతని కుమారుడు వెట్రివేల్‌(30) ఇతని చిన్నాన్న అజాకర్‌(50). సమీపంలో నివశించే రెండు కుటుంబాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి గొడవ జరుగుతోంది. ఈ పరిస్థితిలో ఆదివారం రాత్రి భూమి సమస్యకు సంబంధించి అళగర్‌ వెట్రివేల్‌ మధ్య వాదన జరిగింది. దీనితో కోపంగా ఉన్న అళగర్‌ అతని కుమారులు విఘ్నేష్‌, చంద్రు వెట్రివేల్‌పై గునపంతో దాడి చేశారు. దీనిని అడ్డుకున్న వెట్రివేల్‌ బావమరిది సురేష్‌పై కూడా దాడి జరిగింది. ఇందులో గాయపడిన వెట్రివేల్‌ను కుంభకోణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి వెట్రివేల్‌ మృతి చెందినట్లు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను తదుపరి చికిత్స కోసం తంజావూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి అళగర్‌, చంద్రులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విఘ్నేష్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement