
సాహిత్యానికి నిలయం... భారతదేశం
కొరుక్కుపేట: విభిన్న భాషలు, సంస్కృతితో కూడిన భారతదేశం సాహిత్యానికి నిలయంగా ఉందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు. ఈ మేరకు నైవేలిలోని లిగ్నైట్ హాలు వేదికగా నైవేలి పుస్తక ప్రదర్శన ఘనంగా ముగిసింది. ఆదివారం జరిగిన ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎల్‌సీఐఎల్ పుస్తక ప్రదర్శనకు గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాల పిల్లలను ఉచితంగా తీసుకుని రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. పుస్తకాలు ఎల్లప్పుడూ మన హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయని వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రం గొప్ప సంస్కృతి, సాహిత్యానికి పేరుగడించిందని అభిప్రాయపడ్డారు. భారతదేశం సాహిత్యానికి నిలయమని, వివిధ రాష్ట్రాల విభిన్న సాహిత్యం, కళలలో భరతమాత హృదయ స్పందనను వినవచ్చని పేర్కొన్నారు. ప్రధానమంత్రి వీక్షిత్ భారత్ దార్శనికతను గుర్తు చేసుకుంటూ సాహిత్యం, సంస్కృతి వ్యాప్తి ద్వారా మాత్రమే ఇది వాస్తవం అవుతుందని తెలిపారు. ముందుగా ఎన్‌ఎల్‌సీఐఎల్ సీఎండీ ప్రసన్నకుమార్ మోటుపల్లి మాట్లాడుతూ ఎన్‌ఎల్‌సీఐఎల్ చరిత్రలో నైవేలి పుస్తక ప్రదర్శన ఒక స్వర్ణ దినోత్సవంగా అభివర్ణించారు. కడలూరు జిల్లాలోని 653 పాఠశాలల నుంచి ఉచిత రవాణా సదుపాయం కల్పించి విద్యార్థులను నైవేలి పుస్తక ప్రదర్శనకు తీసుకుని రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 2030 నాటికి పునరుత్పాదక శక్తిని 8 రెట్లు పెంచాలని కంపెనీ ప్రణాళికలు వేసిందని పేర్కొన్నారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ముగిసిన ఎన్‌ఎల్‌సిఐఎల్ పుస్తక ప్రదర్శన