
కాట్టుపల్లిలో నౌకాదళం కీల్ లేయింగ్
సాక్షి, చైన్నె: భారత నౌకాదళానికి థర్డ్ ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎప్‌ఎస్‌ఎస్) కీల్ లేయింగ్‌ను చైన్నె శివారులోని కాట్టుపల్లి ఎల్‌అండ్‌టీ షిప్ యార్డ్‌లో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ వివరాలను నౌకాదళం వర్గాలు ప్రకటించాయి. వైస్ అడ్మిరల్ రాజారామ్ స్వామినాథన్, కంట్రోలర్ వార్‌షిప్ ప్రొడక్షన్– అక్విజిషన్ , ఇండియన్ నేవీ, హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, మెస్సర్స్ ఎల్‌అండ్‌టీ నుంచి సీనియర్ అధికారుల సమక్షంలో దీనిని ఏర్పాటు చేసినట్టు వివరించారు. భారత నౌకాదళం ఆగస్టు 2023లో ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ కొనుగోలు కోసం హెచ్‌ఎస్‌ఎల్‌తో ఒప్పందంపై సంతకం చేసిందిని, డెలివరీ షెడ్యూల్ 2027 మధ్యలో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యం బలాన్ని ప్రదర్శిస్తూ, దేశంలో నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి డెలివరీ కోసం కఠినమైన సమయపాలనను తీర్చడానికి హెచ్‌ఎస్‌ఎల్ రెండు నౌకల నిర్మాణాన్ని కాట్టుపల్లి ఎల్‌అండ్‌టీ షిప్ యార్డ్‌కు సబ్ కాంట్రాక్ట్ చేసినట్టు వివరించారు. సముద్రంలో ఫ్లీట్ షిప్‌లను తిరిగి నింపడం ద్వారా భారత నౌకాదళం ‘బ్లూ వాటర్’ సామర్థ్యాలను బలోపేతం చేస్తున్నదని ప్రకటించారు. 40వేల టన్నుల కంటే ఎక్కువ రవాణా కలిగిన ఈ నౌకలలో ఇంధనం, నీరు, మందుగుండు సామగ్రి, నిల్వలను కలిగి ఉంటాయని వివరించారు. ఇవి సముద్రంలో నౌకాదళంకు దీర్ఘకాలిక, స్థిరమైన కార్యకలాపాలకు వీలు కల్పిస్తాయని, తద్వారా పరిధి అన్నది పెరుగుతుందన్నారు.