
వనితా విజయ్‌కుమార్‌పై ఇళయరాజా పిటిషన్
తమిళసినిమా: ఈ మధ్య కొత్త చిత్రాల్లో పాటలు హిట్ అవుతున్నాయో లేదోగానీ, పాత పాటల రీమిక్స్‌లు మాత్రం ఆయా చిత్రాల వసూళ్లకు ప్లస్ అవుతున్నాయి. దీంతో పలువురు దర్శక నిర్మాతలు పాత చిత్రాలను తమ చిత్రాల్లో వాడుకోవడానికి ఆసక్తి చూపితున్నారు. కాగా ప్రముఖ సంగీతదర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లే కుండా ఎవరైనా తమ చిత్రాల్లో వాడితే వెంటనే వారిపై నష్టపరిహారం కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేస్తారు. తాజాగా నటి వనితావిజయ్‌కుమార్ పై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వనితా విజయ్‌కుమార్ తొలి సారిగా దర్శకత్వం వహించి నాయకిగా నటించిన చిత్రం మిసెస్ అండ్ మిస్టర్. డాన్స్ మాస్టర్ రాబర్ట్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వనితా విజయ్‌కుమార్ కూతురు జోవిక విజయ్‌కుమార్ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా ఇందులో నటుడు కమలహాసన్ మైఖెల్ మదన కామరాజన్ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. కాగా ఆ చిత్రంలోని శివరాత్తిరి అంటూ సాగే పాటను మిస్సెస్ అండ్ మిస్టర్ చిత్రంలో వాడారు. దీంతో తన అనమతి పొందకుండా వనిత తన పాటను వాడారంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో చిత్రం నుంచి తన పాటను వెంటనే తొలిగించాలని, లేకుంటే నష్ట పరిహారం కోరడం జరుగుతుందని ఇళయరాజా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. వచ్చే సోమవారం విచారించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. పాటను వాడుకోవడానికి ఇళయరాజా అనుమతి తీసుకున్నాట్లు, అందుకుగానూ చిత్ర టైటిల్ కార్డులో ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లు ఆ చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.