● నామినేషన్ల దాఖలు ● ఏకగ్రీవమైనట్టే
పళణిస్వామి సమక్షంలో నామినేషన్ దాఖలు చేస్తున్న ధనపాల్
సీఎం స్టాలిన్, ఎంపీ కనిమొళితో కలిసి నామినేషన్ వేస్తున్న సల్మా
సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధితో కలిసి
నామినేషన్ దాఖలు చేస్తున్న కమలహాసన్
సాక్షి, చైన్నె: రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఆరుగురు అడుగు పెట్టనున్నారు. ఇందులో ఐదుగురు కొత్త వారు కావడం విశేషం. డీఎంకే, అన్నాడీఎంకేకు చెందిన ఈ అభ్యర్థులు శుక్రవారం తమ నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం స్టాలిన్ సమక్షంలో మక్కల్ నీది మయ్యం నేత కమల హాసన్ నామినేషన్ దాఖలు చేశారు.
రాష్ట్రానికి చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం జూలైలో ముగియనున్న విషయం తెలిసిందే. వీరిలో డీఎంకేకు చెందిన విల్సన్, అబ్దుల్లా, షణ్ముగం, ఈ కూటమిలోని ఎండీఎంకేకు చెందిన వైగో ఉన్నారు. అలాగే, అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, గతంలో ఈ కూటమి ద్వారా సీటు దక్కించుకున్న పీఎంకే చెందిన అన్బుమణి ఉన్నారు. ఈ ఆరు స్థానాల్లో ఎమ్మెల్యేల సంఖ్యా బలం మేరకు డీఎంకే కూటమికి నాలుగు, అన్నాడీఎంకేకు రెండు దక్కినట్లైంది. ఈ పదవుల భర్తీకి నామినేసన్ల ప్రక్రియ 2వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు జరగనుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియమితులైన అసెంబ్లీ అదనపు కార్యదర్శి బి. సుబ్రమణియన్‌కు ఆశావహులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నికల వీరుడు పద్మరాజన్‌సహా పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే, వీరికి ఎమ్మెల్యేల ప్రతిపాదన మద్దతు లేని దృష్ట్యా, తిరస్కరణకు గురి కావడం తథ్యం. అసెంబ్లీ ఆవరరణలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది.
ఆరుగురు ఏకగ్రీవం
ఆరు స్థానాల్లో నాలుగు డీఎంకే ఖాతాలోకి, రెండు అన్నాడీఎంకే ఖాతాలోకి చేరిన విషయం తెలిసిందే. డీఎంకే తరపున సీనియర్ న్యాయవాది విల్సన్‌కు మళ్లీ అవకాశం కల్పించారు. ఇక, మాజీ ఎమ్మెల్యే సేలంకు చెందిన ఎస్‌ఆర్ శివలింగం, మహిళా రచయిత సల్మాను రాజ్యసభ అభ్యర్థులుగా డీఎంకే ఎంపిక చేసింది. అలాగే, తమ కూటమిలోకి మక్కల్ నీది మయ్యం కట్చి నేత కమల్‌కు అవకాశం కల్పించడంతో ఆయన కూడా తొలిసారిగా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నలుగురు అభ్యర్థులు శుక్రవారం తమ నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. సీఎం స్టాలిన్ సమక్షంలో వీరంతా నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావలవన్, సీపీఎం నేత షణ్ముగం, మనిదనేయమక్కల్ కట్చి నేత జవహరుల్లా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫున మాజీ ఎమ్మెల్యే అబూబక్కర్, డీఎంకే ఎంపీ, కోశాధికారి టీఆర్ బాలు, మంత్రి ఏవీ వేలు హాజరయ్యారు. ఇక, అన్నాడీఎంకే అభ్యర్థులుగా ఎంపికై న మాజీ ఎమ్మెల్యేలు ఇన్బదురై, ఎం.ధనపాల్ సైతం కొత్త ముఖాలే. పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సమక్షంలో ఈ ఇద్దరు తమ నామినేషన్లు ఎన్నికల అధికారికి అందజేశారు. కార్యక్రమానికి అన్నాడీఎంకే నేతలు కేపీ మునుస్వామి, దిండిగల్ శ్రీనివాసన్, ఎస్పీ వేలుమణి, సెంగోట్టయన్, నత్తం విశ్వనాథన్ హాజరయ్యారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ పత్రాలతోపాటు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. ఈ ఆరుగురికి మాత్రమే ఎమ్మెల్యేల మద్దతు ఉన్న దృష్ట్యా, వీరంతా ఏకగ్రీవంగా ఎంపికయ్యే అకకాశాలు ఎక్కువే. శని, ఆదివారాలు సెలవు తర్వాత సోమవారం నామినేషన్లకు చివరి రోజు. ఈనెల 12న ఉప సంహరణ ప్రక్రియ ముగియనుంది. అదే రోజున ఏకగ్రీవ ఎంపిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.
రాజ్యసభకు ఆరుగురు!
● నామినేషన్ల దాఖలు ● ఏకగ్రీవమైనట్టే
● నామినేషన్ల దాఖలు ● ఏకగ్రీవమైనట్టే


