
యువనటీనటులతో నటన ఉత్సాహాన్నిచ్చింది!
తమిళసినిమా: నటుడు ప్రభు, వెట్రి కలిసి నటించి న చిత్రం రాజపుత్తిరన్. నటి కృష్ణప్రియ నాయకిగా నటించిన ఇందులో కోమల్ కుమార్, దర్శకుడు ఆర్‌వీ ఉదయ్ కుమార్, జీఎం కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రీసెంట్ సినీ క్రియేషన్స్ పతాకంపై కేఎం షఫీ నిర్మించిన ఈ చిత్రానికి మహాకందన్ దర్శకత్వం వహించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఐస్ నవ్‌పాల్‌రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని భరణి స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్ర ముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై నటుడు ప్రభు మాట్లాడుతూ ఇందులో తాను నటుడు వెట్రికి తండ్రిగా నటించానని చెప్పారు. చిత్రంలోని ఒక ఐటెం సాంగ్‌లో నటించమని కోరగా తాను కాదన్నానన్నారు. అయినా ఆ పాటలో తనను నటింపజేసినట్లు చెప్పారు. పలువురు యువ నటీనటులు నటించారని, వారితో కలిసి నటించడంతో తనకు ఉత్సాహం కలిగిందని చెప్పారు. ఇప్పుడు చాలా మంది ప్రతిభావంతమైన దర్శకులు వస్తున్నారని, అలాంటి దర్శకుడు మహాకందన్ అన్నారు. ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాలని ప్రశంసించారు. తాను ఇప్పటికీ 74 మంది కొత్త దర్శకులతో కలిసి పని చేశానని, ఇప్పటికీ నటిస్తున్నానని ప్రభు పేర్కొన్నారు. షూటింగ్‌ను కోయంబత్తూరు జిల్లా సొయల్ కుడి గ్రామంలో చిత్రీకరించినట్లు చెప్పారు. ఆ ప్రాంత ప్రజలు తన తండ్రి శివాజీ గణేషన్ పైనా, తన పైన, తన కొడుకు విక్రమ్ ప్రభుపైన ఎంతో అభిమానం చూపిస్తున్నారని చెప్పారు. ఇందులో దర్శకుడు ఆర్వీ ఉదయ్‌కుమార్, జీఎం కుమార్‌తో కలిసి నటించడం మంచి అనుభవంగా నటుడు ప్రభు పేర్కొన్నారు.