
ఘనంగా సత్‌వచ్చారి గంగమ్మ జాతర
వేలూరు: పట్టణంలోని సత్‌వచ్చారిలో ఉన్న రోడ్డు గంగమ్మ జాతర శుక్రవారం ఉదయం వైభవంగా జరిగింది. తొలుత అమ్మవారి శిరస్సును మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేసి, విశేషాలంకరణ చేసి, రథంలో కొలువుదీర్చారు. అనంతరం భక్తులు మేళ తాళాల నడుమ రథం ఊరేగింపుగా సత్‌వచ్చారిలోని ముఖ్యమైన వీధుల్లో సాగింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి రధాన్ని లాగారు. భక్తులు రథంపై బొరుగులు, మిరియాలు చల్లి, మొక్కులు చెల్లించుకున్నారు. సంతానం లేని మహిళలు తడి దుస్తులతో వచ్చి, అమ్మవారికి కర్పూర హారతులిచ్చి, మొక్కుకున్నారు. అనంతరం అమ్మవారి రథాన్ని ఆలయం వద్దకు తీసుకొచ్చి ఆలయంలోని విగ్రహంపై శిరస్సు ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు పొంగుళ్లు పెట్టి, నైవేద్యం సమర్పించారు. వివిధ వేషాధారణ ధరించి, అమ్మవారికి అంబిలి, పట్టు వస్త్రాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మధ్యాహ్నం భక్తులందరికీ బిర్యాని, అన్నదానంతోపాటు నీరు, మజ్జిగ పంపిణీ చేశారు.