ఢిల్లీలో స్టాలిన్‌ బిజీ బిజీ | - | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో స్టాలిన్‌ బిజీ బిజీ

May 24 2025 1:35 AM | Updated on May 24 2025 1:35 AM

ఢిల్ల

ఢిల్లీలో స్టాలిన్‌ బిజీ బిజీ

సాక్షి, చైన్నె: ఢిల్లీ వేదికగా కేంద్రంతో ఢీకొట్టే దిశగా నీతి ఆయోగ్‌ భేటీకి స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్‌ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయనకు డీఎంకే వర్గాలు ఘనస్వాగతం పలికాయి. ఎంపీలు, ముఖ్యులతో సమావేశమయ్యారు. తమిళనాడు భవన్‌లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో భేటీ అయ్యారు.

తమిళనాడుకు విడుదల చేయాల్సిన నిధుల్లో పక్షపాత ధోరణిని కేంద్రం అనుసరిస్తున్నట్టు మొదటి నుంచి రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాము వ్యతిరేకిస్తున్న పథకాలను అమలు చేయాల్సిందేనని కేంద్రం ఒత్తిడి తీసుకురావడాన్ని డీఎంకే పాలకులు ఇప్పటికే తీవ్రంగా పరిగణించారు. అలాగే, లోక్‌సభ పునర్విభజన వ్యవహారంలో, నిధుల విడుదల విషయంలో ప్రధాని మోదీని ఎంపీల బృందంతో వెళ్లి కలిసేందుకు అనుమతి కోరినా, ఇంతవరకు అవకాశం దక్కలేదు. ఈ పరిస్థితులలో శనివారం ఢిల్లీ వేదికగా నీతి ఆయోగ్‌ భేటీ జరుగుతుండడంతో సమావేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఇదివరకు జరిగిన నాలుగు సమావేశాల్లో మూడు సమావేశాలకు సీఎం వెళ్ల లేదు. ఆయన తరఫున ఆర్థిక మంత్రి హాజరయ్యారు. గత ఏడాది జరిగిన సమావేశాన్ని బహిష్కరించారు.

ఢిల్లీ పయనం

ఈసారి నీతి ఆయోగ్‌ భేటీకి తానే స్వయంగా వెళ్లే విధంగా సీఎం స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం ఉదయం చైన్నె నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఆయనకు డీఎంకే వర్గాలు ఘన స్వాగతం పలికాయి. ఎంపీలు టీఆర్‌బాలు, తిరుచ్చిశివ పుష్పగుచ్ఛాలను అందజేశారు. విమానాశ్రయం ఆవరణలో తన కోసం వేచి ఉన్న జనాన్ని సీఎం పలకరించారు. అక్కడి నుంచి నేరుగా తమిళనాడు భవన్‌కు చేరుకున్నారు. శనివారం జరిగే నీతి ఆయోగ్‌ భేటీలో వ్యవహరించాల్సిన అంశాల గురించి ఎంపీలు, ముఖ్య అధికారులతో సమీక్షించారు. కేంద్రం అనుసరిస్తున్న తీరును ఈ సమావేశం ద్వారా ఎండగట్టే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ నివాసానికి సీఎం స్టాలిన్‌ వెళ్లారు. మర్యాదపూర్వక భేటీగా సాగినా, కేంద్రం అనుసరిస్తున్న తీరు గురించి, తమిళనాడు రాజకీయ పరిస్థితులు, కూటమి వంటి అంశాల గురించి ఇందులో చర్చించినట్టు సమాచారం. ఇక, నీతి ఆయోగ్‌ భేటీకి రానున్న కేరళ, కర్ణాటక, పంజాబ్‌, తెలంగాణ తదితర బీజేపీ యేతర ప్రభుత్వాలసీఎంలు, ప్రతినిధులతో వేర్వేరుగా భేటీ అయ్యేందుకు స్టాలిన్‌ నిర్ణయించినట్టు తెలిసిందే. కేంద్రాన్ని ఢీకొట్టేందుకు బీజేపీ యేతర ప్రభుత్వాలు సిద్ధం కావాలని పిలుపునివ్వబోతున్నారు. ఇప్పటికే ఆయన ఆయా రాష్ట్ర సీఎంలకు లేఖలు పంపిన విషయం తెలిసిందే. తాము చేస్తున్న న్యాయపోరాటాలకు మరింత బలం చేకూర్చే విధంగా ఈ భేటీలు జరుగుతున్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ భేటీ గురించి సీఎం స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. సోనియా, రాహుల్‌గాంఽధీలను ఢిల్లీలో కలిసినట్టు, ఒక ప్రత్యేక ఆప్యాయత, కుటుంబాన్ని కలిసిన అనుభూతి కలిగినట్టు చెప్పారు.

సోనియా, రాహుల్‌గాంధీతో భేటీ

నేడు తొలిసారిగా నీతి ఆయోగ్‌ భేటీకి హాజరు

ఢిల్లీలో స్టాలిన్‌ బిజీ బిజీ1
1/1

ఢిల్లీలో స్టాలిన్‌ బిజీ బిజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement