
వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
కొరుక్కుపేట: శ్రీఆంధ్ర కళా స్రవంతి తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. చైన్నె కొరట్టూరు అగ్రహారంలోని కోదండ రామాలయంలో టీటీడీ దేవస్థానం క్యాలెండర్ ప్రకారం శాస్త్రోక్తంగా ఈ వేడుకలు నిర్వహించారు. ముందుగా పండితులు సుసర్ల కుటుంబ శాస్త్రి నేతృత్వంలో వివిధ రకాల హోమాలు, పూర్ణాహుతి నిర్వహించగా సుమారు 200 మందికి పైగా భక్తులు పాల్గొని, హనుమాన్ సేవలో తరించారు. హనుమంతునికి 108 కేజీల వివిధ రకాల ఫల, పుష్పాలు, వడమాల, తమలపాకు, వెన్న అలంకరించారు. అనంతరం అర్చన, అభిషేకాలు చేశారు. 108 భిన్నమైన శ్రావ్య రాగాలతో–హనుమాన్ చాలీసా పఠనం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ రామాంజనేయ నామ సంకీర్తన మండలి, శ్రీ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్తీక్ టిఫిన్ సెంటర్ రవిచంద్రన్ మధ్యాహ్నం భక్తులకు అన్న ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్కిటెక్ట్ బీఎన్ గుప్త కుటుంబం, ఫార్మాసూటికల్ ఎండీ వి భాస్కరరావు పాల్గొనగా, శ్రీఆంధ్ర కళా స్రవంతి తరఫున కోశాధికారి జీవీ రమణ, ఇ. బాలాజీ, వీఎన్ హరినాథ్, సురేంద్ర, దామోదరన్ పాల్గొన్నారు.