
తిరువళ్లూరులో ఆగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ప్రయాణికుల ఇక్కట్లు
తిరువళ్లూరు: అరక్కోణం సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన క్రమంలో చైన్నె నుంచి అరక్కోణం మీదుగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, లోకల్ రైళ్లు దాదాపు రెండు గంటల పాటు తిరువళ్లూరు తదితర ప్రాంతాల్లో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివరాలు.. రాణిపేట జిల్లా అరక్కోణం రైల్వేస్టేషన్ నుంచి వాలాజ రోడ్డుకు గూడ్స్ రైలు గురువారం మద్యాహ్నం బయలుదేరింది. అరక్కోణం సమీపంలో వెళ్ళుతున్న సమయంలో ఇంజిన్ నుంచి మొదటి నాలుగు కార్లు పట్టాలు తప్పడంతో ప్రమాదం ఏర్పడింది. దీంతో చైన్నె నుంచి వేలూరు, తిరుపతి, తిరుత్తణి, అరక్కోణం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన లాల్‌బాగ్, హుబ్లీ, జోలార్‌పేట, గరుడాద్రితో పాటూ పలు రైళ్లను తిరువళ్లూరులో నిలిపివేశారు. దాదాపు రెండు గంటల పాటు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రెండు గంటల తరువాత తిరువళ్లూరులో ఆగిన పలు రైళ్లను కొనసాగించారు.