
ఈడీ దూకుడుకు బ్రేక్
సాక్షి, చైన్నె: టాస్మాక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుకు సుప్రీం కోర్టు బ్రేక్ వేసింది. సోదాలు, విచారణలకు చెక్ పెడుతూ గురువారం స్టే విధించింది. అలాగే, ఈడీ తీరుపై న్యాయమూర్తులు అక్షింతలు వేశారు. వివరాలు.. చైన్నెలోని తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్(టాస్మాక్) ప్రధాన కార్యాలయంలో మార్చి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలు, కొనుగోలు, టెండర్ల ప్రక్రియలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు చిక్కినట్టు సమాచారాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్దఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేవిధంగా ముందుకెళ్లాయి. అదే సమయంలో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులను విచారించే దిశగా ఈడీ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం, టాస్మాక్ తరపున మూడు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. చట్ట విరుద్ధంగా టాస్మాక్ కార్యాలయంలో సోదాలు జరపడమే కాకుండా, అధికారులు, సిబ్బందిని విచారణ, సోదాల పేరిట వేధిస్తున్నట్టు వాదనలు కోర్టుకు చేరాయి. సోదాల సమయంలో మహిళా అధికారిణులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారన్న టాస్మాక్ తరపున వాదన కేసులో కీలకంగా మారింది. అదే సమయంలో తొలుత ఓ బెంచ్, ఆతర్వాత మరో బెంచ్ కేసును విచారించడంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు న్యాయమూర్తులు ఎస్‌ఎం సుబ్రమణియన్, రాజశేఖరన్ బెంచ్ ఈడీకి అనుకూలంగా న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఈడీ తరపు వాదనలను పరిగణించి, తదుపరి విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దూకుడుతో సుప్రీంకోర్టుకు..
దేశ ప్రయోజనాల దృష్ట్యా కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈడీకి కల్పిస్తున్నట్టు న్యాయమూర్తులు ప్రకటించారు. దీంతో ఈడీ దూకుడు పెంచింది. విచారణను వేగవంతం చేసింది. గత వారం చైన్నెలోని టాస్మాక్ డైరెక్టర్ విశాఖన్‌తో పాటూ పారిశ్రామిక వేత్తలు, డిప్యూటీ డైరెక్టర్లు, టాస్మాక్ అధికారులను ఈడీ టార్గెట్ చేసి సోదాలు విస్తృతంగా నిర్వహించింది. తమకు లభించిన ఆధారాలతో సంబంధిత అధికారులను విచారించే పనిలో పడింది. అదే సమయంలో ఈ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తి డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడు అన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈకేసు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నట్టు ఆది నుంచి డీఎంకే పాలకులు పేర్కొంటూ వచ్చారు. చివరకు ఈడీ దూకుడుకు కల్లెం వేయడానికి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణకు వచ్చింది. టాస్మాక్‌లో రూ. 1000 కోట్ల స్కాం అన్నప్పుడు అస్సలు మూల కేసు ఎక్కడ? అని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనార్హం. ఈడీ అన్ని నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తుండడం స్పష్టమవుతోందని న్యాయమూర్తులు అక్షింతలు వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమైఖ్య పాలనను చిన్నా భిన్నం చేసే విధంగా ఈడీ చర్యలు ఉన్నట్టుందని అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత అంశాన్ని అస్త్రంగా చేసుకుని ఏకంగా ఓ సంస్థను టార్గెట్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ, ఈడీ విచారణకు స్టే విధించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులతో తమిళనాడు ప్రభుత్వానికి మరో విజయం దక్కినట్లయ్యింది.
విచారణపై స్టే.. అధికారుల తీరుపై ఆగ్రహం
టాస్మాక్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
ఈడీకి చెంపపెట్టుగా అభివర్ణించిన డీఎంకే కూటమి
రెండో విజయం..
ఇటీవల పది ముసాయిదాల వ్యవహారంలో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తమిళనాడుకు విజయాన్ని చేకూర్చింది. తాజాగా టాస్మాక్‌లో అక్రమాలు అంటూ సాగుతున్న పరిణామాలకు సుప్రీం కోర్టుచెక్ పె ట్టడంతో మరో విజయం దక్కినట్టైంది. ఈ ఉత్తర్వులు ఈడీకి చెంప పెట్టు అని డీఎంకే సీనియర్ నేత ఆర్‌ఎస్ భారతీ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టే ఈ ఉత్తర్వులను ఆహ్వానిస్తున్నామన్నారు. డీఎంకే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు రావడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతూ వచ్చాయని ధ్వజమెత్తారు. సీపీఐ నేత ముత్తరసన్ పేర్కొంటూ, బీజేపీ ఆశలను, కోరికలను తీర్చే సంస్థగా ఈడీ మారి ఉందని ధ్వజమెత్తారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఈ సంస్థ రాజకీయ కక్ష సాధింపునకు అస్త్రంగా మారి ఉండడం సిగ్గు చేటు అని వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, ఈడీ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని కేంద్రం సాగిస్తూ వస్తున్న బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఈ ఉత్తర్వులు ఒక చెంప పెట్టు అని సూచించారు. ఇదిలా ఉండగా వీసీల నియామకం వ్యవహారానికి సంబందించి చట్టంలోని సెక్షన్లకు స్టే విధిస్తూ మద్రాసు హైకోర్టు బెంచ్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు డీఎంకే పాలకులు సిద్ధమవుతున్నారు.

ఈడీ దూకుడుకు బ్రేక్