బావిలో పడి బాలుడి మృతి
సేలం: బావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. సేలం సమీపంలోని నీల్వరపట్టి ప్రాంతానికి చెందిన శక్తివేల్ దినసరి కూలీ. ఇతనికి నిషాంత్ (8) కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. మంగళవారం ఉదయం వెతుకులాట కొనసాగించగా, అక్కడి సమీపంలోని ఓ బావిలో అతని మృతదేహం కనిపించింది. ఈ విషయమై మల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి, సేలం ప్రభుత్వాస్పత్రికి పంపారు. శవపరీక్ష తర్వాతే బాలుడు ఎలా చనిపోయాడో తెలుస్తుంది. అతను బావిలో పడి చనిపోయాడా?, లేక ఎవరైనా అతన్ని చంపి బావిలో పడేశారా? అనే విషయంలో మిస్టరీ కొనసాగుతోంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


