
అన్నింటా నంబర్–1 లక్ష్యం
● తిరుచ్చి క్షేత్ర స్థాయి పర్యటనలో సీఎం స్టాలిన్ ● బ్రహ్మాండ బస్ టెర్మినల్ ప్రారంభం
సాక్షి, చైన్నె: అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని నంబర్–1 స్థానంలో నిలబెట్టడమే ద్రావిడ మోడల్ ప్రభుత్వ లక్ష్యం అని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. తిరుచ్చిలో రెండవ రోజు శుక్రవారం సీఎం స్టాలిన్ క్షేత్రస్థాయి అధ్యయన పర్యటన జరిగింది. ఇందులోభాగంగా తిరుచ్చి పంజపూర్‌లో రూ.408కోట్లతో నిర్మించిన బ్రహ్మాండంగా కౖలైంజ్ఞర్ కరుణానిధి ఇంటి గ్రేటెడ్ బస్ టెర్మినల్‌ను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. అలాగే, తిరుచ్చిలో రూ.236 కోట్లతో పెరియార్ ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.128.94 కోట్లతో అన్నా పేరిట భారీ వస్తువుల తరలింపునకుగాను కార్గో టెర్మినల్, ప్రైవేటు ఆమ్నీ బస్ టెర్మినల్‌ను ప్రారంభించారు. పెరియార్ ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్‌ను 22 ఎకరాల్లో నిర్మించనున్నారు. కార్గో టెర్మినల్‌ను 38.10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నా విగ్రహాన్ని సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు. తిరుచ్చి నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలుగా శివారులో రూ.162 కోట్లతో బహుళార్థక సాధక షాపింగ్ మాల్, రూ.246.18 కోట్లతో అత్యాధునిక వసతులతో బస్ టెర్మినల్ రూపుదిద్దుకుంది. ఇక్కడ పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ విగ్రహాలను ఏర్పాటుచేసి ఆవిష్కరించారు. అలాగే, కుంభకోణం రాష్ట్ర రవాణా సంస్థకు 102 కొత్త బస్సులను అందజేశారు.
విల్లుపురం రాష్ట్ర రవాణా సంస్థకు 8 కొత్త బస్సులు, కోయంబత్తూరు రాష్ట్ర రవాణా సంస్థకు 10 బస్సులు సహా మొత్తం 120 బస్సులకు ఈసందర్భంగా సీఎం స్టాలిన్ జెండా ఊపారు. మంత్రులు కేఎన్ నెహ్రూ, రఘుపతి, శివశంకర్, అన్బిల్ మహేశ్, శివ వి.మెయ్యనాథన్, ఎంపీ తిరుచ్చిశివ, మేయర్ అన్బలగన్, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు.
ప్రగతి విజయోత్సవ సభ
తిరుచ్చిలో ఇద్దరు మంత్రులు నెహ్రూ, అన్బిల్‌మహేశ్ ఉన్నారని, ఈ ఇద్దరికి ఈ నగరం అంటే ఎంతో ఇష్టమని, అందుకే పోటీపడి మరీ అభివృద్ధి చేస్తున్నారని కితాబిచ్చారు. ఇది ప్రభుత్వ కార్యక్రమంలా లేదని, తిరుచ్చి ప్రగతి విజయపు బహిరంగ సభ అన్నట్టుగా ఉందన్నారు. ఇక్కడ రూ.290 కోట్లతో కర్మయోగి కామరాజర్ పేరిట బ్రహ్మాండ గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం, రూ.18.9 కోట్లతో బర్డ్ పార్క్, రూ.150కోట్లతో ఇంటర్నేషనల్ ఒలింపిక్ అకాడమీ, రూ.3 కోట్లతో జల్లికట్టు స్టేడియం, రూ. 4.27 కోట్లతో పచ్చమలై టూరిజానికి చర్యలు చేపట్టామన్నారు. అలాగే, ఈ తిరుచ్చి జిల్లాలో పారిశ్రామిక ప్రగతిని చాటే విధంగా మనప్పారైలో 1,100 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కానున్నట్టు తెలిపారు. రూ.400 కోట్లతో టైడల్ పార్కు పనులకు ఇటీవల శంకు స్థాపన చేసినట్టు గుర్తుచేశారు. అనేక మెగా ప్రాజెక్టులు తిరుచ్చికి మాత్రమే మంజూరు చేశామన్నారు. అంతేకాదు, తాను ఇప్పటివరకు హాజరైన కార్యక్రమాలను తలదన్నేలా లక్షా 17 వేల 132 మంది లబ్ధిదారులకు రూ. 856 కోట్లు విలువగల సంక్షమే పథకాలను అందజేశామన్నారు. నాలుగు సంవత్సరాలుగా అమలు చేసిన ప్రతి పథకం ఒక మైలురాయిగా పేర్కొంటూ, భవిష్యత్తు దృష్ట్యా, మరిన్ని ప్రణాళికలను రూపొందించేందుకు చర్యలు వేగవంతం చేశామని ఆయన తెలిపారు.
సంపన్న తమిళనాడు
తమిళనాడును అనేక రంగాల వారీగా ఉన్నత స్థానంలో నిలబెట్టామని, పెరుగుతున్న అవకాశాలతో సంపన్న తమిళనాడు లక్ష్యంగా విస్తృత చర్యలు తీసుకున్నామన్నారు. అన్నదాత కంట ఆనందం, అందరికీ ఉన్నత–నాణ్యత విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవన నాణ్యత, అందరికీ అన్నీ లక్ష్యంతో పాటు తమిళనాడు సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా వాగ్దానాలు గతంలో ఇచ్చామన్నారు. ఇందులో నాలుగు వాగ్దానాలు ఇప్పటికే నెరవేర్చామన్నారు.అన్నింటా భారతదేశంలో మనమే నంబర్–1 గా ఉండాలన్న కాంక్షతో బృహత్తర పథకాలు, ప్రణాళికలను అమలు చేస్తున్నామని వివరించారు. అయితే, ఇవన్నీ చూసి ఓర్వలేక, ఈర్ష్యతో ప్రధాన ప్రతిపక్ష నేత పళణిస్వామి విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. 4 సంవత్సరాల్లో ఎన్నో రికార్డులు సృష్టించామని వివరిస్తూ ఇక, మరింతగా రాకెట్ వేగంతో అభివృద్ధి జరగబోతోందని ధీమా వ్యక్తం చేశారు.