
పరిశ్రమల స్థాపనలో వేలూరు వెనుకంజ
వేలూరు: వేలూరు జిల్లా పరిశ్రమల స్థాపనలో వెనుకంజలో ఉందని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. వేలూరు కలెక్టరేట్‌లో మాజీ ఆర్మీ సిపాయిలు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ మాజీ సైనికుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వేలు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఇండియాలోనే అధికంగా ఆర్మీలో ఉండే వారి జాబితాలో వేలూరు జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. ఇది ఆయా కుటుంబాలకే కాదు వేలూరు జిల్లాకు గర్వకారణమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కాక్కుం కరంగల్ అనే పథకం ద్వారా రూ.1 కోటి వరకు రుణాలు అందజేస్తుందని, వీటిలో 30 శాతం సబ్సిడీతో పాటు మూడు శాతం మాత్రమే వడ్డీ ఉంటుందని వీటిని మాజీ సైనికులు సద్వినియోగం చేసుకొని చిన్నచిన్న పరిశ్రమల స్థాపనకు కృషి చేయడంతోపాటు పలువురు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రస్తుతం ఈ పథకంలో మొత్తం 200 మంది దరఖాస్తు చేసుకున్నారని వీరిలో 80 మందిని ఎంపిక చేసి ఇప్పటికే 40 మందికి పరిశ్రమల స్థాపనకు శిక్షణ ఇచ్చామన్నారు. మిగిలిన వారికి మరో విడత శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకొని వేలూరు జిల్లాలో ఎటువంటి పరిశ్రమలు స్థాపిస్తే బాగుంటుందనే విషయాలపై ఆరా తీసి పరిశ్రమలు స్థాపించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి భువన, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనికులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వైద్య పరీక్షలు చేశారు.