
చిత్ర పౌర్ణమికి తాత్కాలిక బస్టాండ్‌లు
– ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చే బస్సులకు
ప్రత్యేక బస్టాండ్
వేలూరు: తిరువణ్ణామలై శ్రీఅరుణాచలేశ్వరాలయంలో జరిగే చిత్ర పౌర్ణమికి పట్టణంలో మొత్తం 20 తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ సుధాకర్ అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగే చిత్ర పౌర్ణమికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఆయా రోడ్లులోనే తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు పోలూరు మార్గంలో తిరువణ్ణామలై బైపాస్ సమీపంలోని శ్రీముకాంబిగై నగర్, ఎకేఎస్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌లో భక్తులను దింపి వేసి అక్కడ నుంచి బయల్దేరి వెళ్తాయన్నారు. అదే విధంగా తిరుత్తణి, వేలూరు, కేజీఎఫ్, ఆర్కాడు, ఆరణి తదితర ప్రాంతాల నుంచి తిరువణ్ణామలై వచ్చే బస్సుల కోసం గిరివలయం రోడ్డు సమీపంలోని అన్నా విగ్రహం వద్ద తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేశామన్నారు. అవ్యలూరు పేట రోడ్డు, కాంచీపురం మేల్‌మరవత్తూరు రోడ్డు, వందవాసి, సేత్తుపట్టు, దిండివనం రోడ్డు, చైన్నె–పుదుచ్చేరి రోడ్డు, వేట్టవలం రోడ్డు, తిరుకోవిలూరు రోడ్డు బస్సులకు ఆయా రోడ్లులోనే తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 11, 12, 13వ తేదీల్లో ఈ తాత్కాలిక బస్టాండ్‌ల నుంచే భక్తులు వచ్చి వెళ్లాలని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కేటాయించిన బస్టాండ్‌కు మాత్రమే రావాలని పట్టణంలో ట్రాఫిక్ సమస్య రాకుండా చూడాలన్నారు. అదే విధంగా కార్లు, బైకులకు ప్రత్యేక పార్కింగ్ వసతి ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా 130 ప్రత్యేక ప్రభుత్వ బస్సులు, ఐదు వేల మందితో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పౌర్ణమి రోజున భక్తులు మహా కొండపైకి అనుమతించబోమని, కొండ చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.