
ఆపరేషన్ సిందూర్‌పై సర్వత్రా హర్షం
సాక్షి, చైన్నె: కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్ ఇస్తూ.. మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్‌ను భారత ఆర్మీ విజయవంతం చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలోని తొమ్మిది చోట్ల మెరుపు దాడులు జరిపింది. ఈ దాడితో పాక్ – భారత్ మధ్య మరింతగా యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేయడమే కాదు, మరింత ముందుకు వెళ్లినా, తమ సంపూర్ణ మద్దతు భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఉంటాయని పార్టీలకు అతీతంగా నేతలు బుధవారం ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్ స్పందిస్తూ, మనదేశం, మన ఆర్మీకి తమిళనాడు పక్కబలంగా ఉంటుందని ప్రకటించారు. భారత ఆర్మీ మున్ముందు చేపట్టే తీవ్రతకు మద్దతుగా ఉంటామన్నారు. గవర్నర్ ఆర్ ఎన్ రవి పేర్కొంటూ ఆర్మీకి అభినందనలు తెలియజేశారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆర్మీ సాహసాన్ని కొనియాడారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి స్పందిస్తూ, న్యాయమే గెలుస్తుందని, ఈ దాడి ఆనందకరం అని వ్యాఖ్యలు చేశారు. పీఎంకే నేత అన్బుమణి , తమిళ మానిల కాంగ్రెస్ నేత జికే వాసన్, బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్, మహిళా నేతలు తమిళిసై సౌందరరాజన్, కుష్భు, నటుడు శివకార్తికేయన్ సైతం సిందూర్ ఆపరేషన్‌ను ఆహ్వానించారు. ఇక, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ అయితే, మన ఆర్మీకి రాయల్ సెల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీ కాంత్ స్పందిస్తూ, పోరాట యోధుడి యుద్ధం ఆరంభమైందని, లక్ష్యాన్ని చేధించే వరకు పని ఆగదంటూ ప్రధాని మోదీకి దేశ ప్రజలంతా వెన్నంటి ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని పార్టీల నేతలు, ప్రముఖులు స్పందిస్తూ, ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేయడాన్ని ఆహ్వానించారు. ప్రతి భారతీయుడు హర్షం వ్యక్తం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగే ఆర్మీ ఆపరేషన్లకు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి.
భద్రత కట్టుదిట్టం..
యుద్ధ సన్నాహాలు మొదలైనట్టుగా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలోని సముద్ర తీరంలో భద్రతను కట్టుదిట చేశారు. చైన్నె నుంచి కన్యాకుమారి వరకు వెయ్యి కిమీ దూరానికి పైగా సముద్రం తమిళనాట విస్తరించి ఉండటంతో కోస్టుగార్డు, నావికాదళం, ఎయిర్ ఫోర్స్, సముద్ర తీర భద్రతా విభాగం, తీర పోలీసు యంత్రాంగం అలర్ట్ అయ్యింది. సముద్ర తీరంలో చొరబాట్లకు ఆస్కారం ఇవ్వకుండా నిఘా పటిష్టం చేశారు. తీర గ్రామాలలోని ప్రజల్ని కలిసి అనుమానితులు కనిపించినా, సముద్రంలో అనుమానిత పడవలు ఎదురైనా తక్షనం సమాచారం ఇచ్చే విధంగా జాలర్లకు సూచనలు చేశారు. రామేశ్వరం, పాంబన్ తీరాలు శ్రీలంకకు కూత వేటు దూరంలో ఉండడంతో ఇక్కడ భద్రత అన్నది మరింత కట్టుదిట్టం చేసి డేగ గళ్ల నిఘాతో పర్యవేక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలలోనూ భద్రతను పెంచి తనిఖీలు ముమ్మరం చేశారు. చైన్నె నుంచి పంజాబ్, చండీఘర్ తదితర నగరాలకు వెళ్లే అనేక విమాన సేవలు రద్దు నేపథ్యంలో ఇక్కడ పార్కు చేసిన విమానాలకు ఆయా సంస్థల భద్రతను పెంచుకున్నాయి.
భారత ఆర్మీపై ప్రశంసల వర్షం
చైన్నెలో పకడ్బందీగా మాక్‌డ్రిల్
సర్వత్రా ఉత్కంఠ
యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ఏదేని దాడులు ఎదురైన పక్షంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించే విధంగా చైన్నెతోపాటూ కొన్ని నగరాలలో మాక్‌డ్రిల్ బుధవారం సాయంత్రం జరిగింది. త్రివిధ దళాలు, కోస్టుగార్డు, స్థానిక పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య బృందాలు తదితరులతో కూడిన ప్రత్యేక డ్రిల్ జరిగింది. చైన్నె హార్బర్ పరిసరాలలో ఉదయాన్నే యుద్ధ ట్యాంకర్లు మోహరించడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, మాక్‌డ్రిల్ కోసం అవి వచ్చినట్టు తెలుసుకుని ఆ పరిసర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. యుద్ధ సన్నద్ధతను పరిశీలించే విధంగా ఈ మాక్ డ్రిల్ చైన్నె హార్బర్, కల్పాకం అణు విద్యుత్ కేంద్రం తదితర ప్రాంతాలలో జరిగాయి. కమ్యూనికేషన్ నెట్ వర్క్స్, కంట్రోల్ రూమ్స్ సన్నద్ధం, పౌరులు, విద్యార్థులకు శిక్షణ, తమను తాము ఎలా రక్షించుకోవాలో ప్రజలకు వివరించే విధంగా డ్రిల్ జరిగింది. అలాగే ఏదేని దాడులు జరిగిన పక్షంలో బాధితులను ఆస్పత్రులకు తరలించడం, రక్షించడం వంటి అంశాలను కళ్లకు గట్టినట్టుగా ప్రదర్శించారు. కల్పాకం, హార్బర్‌లోపల నాలుగు గంటల నుంచి ఈ మాక్ డ్రిల్ జరిగింది. ఇక తమిళనాడు స్టేట్ ఎమర్జెన్సీ కంట్రోల్ ఆపరేషన్ పేరిట ప్రభుత్వ కార్యాలయాల సముదాయం మెరీనా తీరంలోని ఎళిలగంలో డ్రిల్ నిర్వహించారు.
పాకిస్థాన్‌లోని ముష్కర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆర్మీ జరిపిన ఆపరేషన్ సిందూర్‌కు అన్నివర్గాలు తమ మద్దతు ప్రకటించారు. కేంద్రం తీసుకునే చర్యలకు, ప్రధాని మోదీ చేపట్టే ఎలాంటి ఆపరేషన్లకై నా తోడ్పాటుగా ఉంటామని రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు ప్రకటించారు. పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఆపరేషన్ సిందూర్‌పై సర్వత్రా హర్షం