
రథోత్సవ సంరంభం
బృహదీశ్వరాలయంలో
● భక్త జనంతో నిండిన కళల కానాచి
సేలం: ప్రసిద్ధి చెందిన బృహదీశ్వరాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రథోత్సవ సంబరం అత్యంత వేడుకగా జరిగింది. భక్త జన సాగరంలో తంజావూరు మునిగింది. వివరాలు.. కళలకు కానాచిగా తంజావూరు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడి కళలు ప్రపంచ సంపద ప్రసిద్ది గాంచినవి. అంతే కాదు. ఇక్కడి బృహదీశ్వరాలయం చోళ రాజుల భక్తికి ప్రతి రూపం. బిగ్ టెంపుల్‌గా పిలవబడే ఈ ఆలయం యునెస్కో గుర్తింపును పొందింది. పర్యాటకంగా, ఆథ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన బిగ్ టెంపుల్ చిత్తిరై రథోత్సవ సంబరాల బ్రహ్మోత్సవం గత నెలాఖరు నుంచి అత్యంత వేడుకగా జరుగుతూ వస్తున్నది. త్యాగరాజ స్వామి, కమలాంబాల్ (శివ పార్వతులు)లు ఇక్కడ కొలువై ఉన్నారు. వీరికి నిత్య పూజలు, వాహన సేవలు కనుల పండువగా జరుగుతూ వస్తున్నాయి. ఈ ఉత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టం రథోత్సవం. ఈ వేడుకను తిలకించేందుకు తంజావూరు, తిరువారూర్, అరియలూరు, నాగపట్నం, మైలాడుతురై, పుదుకోట్టై, తిరుచ్చి జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తుల తరలి బుధవారం వేకువ జామున తరలి రావడంతో తంజావూరు జన సాగరంలో మునిగింది. ఉదయాన్నే బృహదీశ్వరాలయ సన్నిధిలో విశేష పూజాది కార్యక్రమాలు జరిగాయి. అభిషేకాలు నిర్వహించి త్యాగరాజ స్వామి, కమలాంబాల్ (శివ పార్వతులు)లకు ప్రత్యేక అలంకారాన్ని శివాచార్యులు చేశారు. అలాగే, వినాయకుడు, అసురదేవుడు, వల్లి, దైవాను, మురుగన్, నీలోత్తమన్, చండీశ్వరర్ ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు జరిగాయి. శివాచార్యుల బృందం వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ , 49 అడుగులతో కూడిన రథం త్యాగరాజ స్వామి, కమలాంబాల్ ఆశీనులయ్యారు. ముందు వైపుగా చిన్న రథాల్లో వినాయకుడు, అసుర దేవన్ వల్లి, దైవాను , మురుగన్, వెనుక వైపుగా నీలోత్తమన్, చండీశ్వరర్‌లు మరో చిన్న రథాల్లో ఆశీనులయ్యారు.
జయజయ ధ్వానాల మధ్య..
శివాచార్యుల వేద మంత్రోచ్చారణలు, భక్త జనుల జయ జయ ధ్వానాలు, శివ నామ స్మరణ, మేళ తాళాల నడుమ ఉదయం 7 గంటల మధ్యలో రథం ముందుకు కదిలింది. వేలాదిగా తరలి వచ్చిన భక్త జనం స్వామి అమ్మవార్లను కనులార దర్శించి పునీతులయ్యారు. ఆలయ మేల్, కీల్, వడక్కు, తెర్కు మాడ వీధుల్లో కనుల పండువగా సాగిన ఈ అపూర ఘటాన్ని తిలకించేందుకు జన సందోహం తరలి రావడంతో శివనామస్మరణతో తంజావూరు పులకించింది. భక్తుల సేవలు పలు స్వచ్చంద సంస్థలు తరించాయి. మజ్జిగా , నీళ్ల ప్యాకెట్లను పంపిణీ చేశాయి. అన్నదానాలు చేశారు. వైద్య, ఆరోగ్య సేవలు అందించారు. ఆలయ మాడ వీధుల్లో అత్యంత వైభవంగా రథోత్సవం సాగడంతో భక్తుల ఆనందానికి అవదులు లేవు. మధ్యాహ్నం సమయంలో తిరిగి ఆలయం వద్దకు చేరుకున్న స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం కామరాజర్ కూరగాయాల మార్కెట్ వ్యాపారుల తరపున భక్తులు సంహపంక్తి భోజనంతో విందు ఏర్పాటు చేశారు.

రథోత్సవ సంరంభం

రథోత్సవ సంరంభం