● మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాజర్
తిరువళ్లూరు: జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులను ప్రాముఖ్యత ప్రాతిపదికన నివేదికను సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి నాజర్ అధికారులను ఆదేశించారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండికి ఏప్రి ల్ మొదటి వారంలో ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ రానున్నారు. సీఎం జిల్లా పర్యటనలో భాగంగా లక్ష మందికి పట్టా, పింఛన్, పక్కా గృహాలను అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం రాక సందర్భంగా ఏర్పాట్లపై అన్ని శాఖలకు చెందిన అధికారులతో మంత్రి నాజర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాజర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే పూర్తయిన పను లు, శంకుస్థాపన చేసి ప్రారంభం కాని పనులు, మధ్యలో ఆగిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యంగా సాగడానికి గల కారణాలను తెలుసుకోవడంతోపాటు సాధ్యమైన మేర కు పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం రాక సందర్భంగా జిల్లాకు అవసరమైన పనులపై సైతం ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రయారిటీ ఆధారంగా పనులను ఎంపిక చేయాలని సైతం కోరారు. కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, గోవిందరాజన్, దురైచంద్రశేఖర్, ఆవడి మేయర్ ఉదయకుమార్, కమిషనర్ కందస్వామి, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్ తదితరులు పాల్గొన్నారు.