
భక్తులతో పోటెత్తిన తిరుత్తణి
తిరుత్తణి: వేసవి సెలవులు, ఆదివారం సందర్భంగా తిరుత్తణి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మూడు గంటల పాటు వేచివుండి భక్తులు స్వాఽమి దర్శనం చేసుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి పాఠశాలలకు వేసవి సెలవులు సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా వుంది. జూన్ 2న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న క్రమంలో ఆదివారం భక్తులు కొండకు పోటెత్తారు. వేకువజాము నుంచి రాత్రి వరకు ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉచిత దర్శన క్యూలు నిండగా మూడు గంటల పాటు భక్తులు వేచివుండి స్వామి దర్శనం చేసుకున్నారు. అలాగే రూ.వంద ప్రత్యేక దర్శన క్యూలో రెండు గంటల వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు వేకువజామున స్వామికి అభిషేక పూజలు చేసి బంగారు కవచం, ఆభరణాలతో సర్వాంగసుందరంగా అలంకరించి మహాదీపారాధన పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయం ద్వారా తాగునీరు, ప్రసా దాలు పంపిణీ చేశారు. వేడి తగ్గి చల్లని వాతావరణంతో ఇబ్బందులు తలెత్తతకుండా భక్తులు క్యూలో వేచివుండి స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో కానుకలు చెల్లించారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 30 వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

భక్తులతో పోటెత్తిన తిరుత్తణి