
పది కిలోల గంజాయి స్వాధీనం
● గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
తిరువళ్లూరు: గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు కోలాడి చెరువు వద్ద వ్యక్తి యువతే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ సుభాషిణి, సబ్ ఇన్‌స్పెక్టర్ భువనేశ్వరికి రహస్య సమాచారం అందింది. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడ బ్యాగుతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. పోలీసుల విచారణలో పట్టుబడిన వ్యక్తి తంజావూరు జిల్లా సేదుభావసత్రం గ్రామానికి చెందిన బాలగురు కుమారుడు పళణివేల్(46)గా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయిని రైలులో తీసుకొచ్చి తిరువేర్కాడులో విక్రయిస్తున్నట్టు నిర్ధారించి, పళణివేల్‌ను అరెస్టు చేశారు. అనంతరం నిందితుడి వద్ద పది కిలోల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించడంతో అతడ్ని పుళల్ జైలుకు తరలించారు.