
ప్రాణరక్షణలో అంబులెన్స్ పాత్ర కీలకం
● అసిస్టెంట్ పోలీసు కమీషనర్ చొక్కయ్య వ్యాఖ్య
కొరుక్కుపేట: అత్యవసర సమయంలో నిండు ప్రాణాలను కాపాడడంలో అంబులెన్స్‌ల పాత్ర కీలకమని ట్రిఫ్లికేన్ డివిజన్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ట్రాఫిక్ )చొక్కయ్య కొనియాడారు. ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చైన్నెలోని అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో 1066 అత్యవసర సేవలపై దృష్టి సారించేలా ఫ్లీట్ ఆఫ్ హోప్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చొక్కయ్య అంబులెన్స్‌లకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల ప్రాణాలను కాపాడడంలో అంబులెన్స్ సేవలను తీసుకునిరావడం అభినందనీయమన్నారు. రెండు దశాబ్దాల క్రితం తాను ప్రమాదానికి గురై రోడ్డుపై పడి ఉంటే అంబులెన్స్ తన ప్రాణాలను కాపాడిందని, అనంతరం తేనంపేట అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందానని చెప్పారు. తన జీవితంలో అపోలో ఆస్పత్రిని మరిచిపోలేనన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీస్ చీఫ్ డాక్టర్ రోహిణి శ్రీధర్, అపోలో ఆస్పత్రి చైన్నె రీజియన్ సీఈఓ డాక్టర్ ఇలంకుమరన్ కలియమూర్తి, అపోలో హాస్పిటల్ దక్షిణ ప్రాంతాలోని అత్యవసర విభాగాల ప్రాంతీయ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ధవపళని, హెల్త్‌కేర్ లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ డాక్టర్ రామకృష్ణ విజయ్‌వర్మ పాల్గొన్ని మాట్లాడారు.