
స్కూల్ పిల్లలకు ఉచితం
తమిళసినిమా: నటుడు యోగిబాబు, దర్శకుడు కేఎస్.రవికుమార్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం స్కూల్ క్వాంటం ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్‌కే విద్యాధరన్ దర్శకత్వం వహించారు. ఇది పూర్తిగా పాఠశాల ఆవరణలో జరిగే కథతో తెరకెక్కిన కథా చిత్రం. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఎలా పోరాడి గెలవాలి అన్న చక్కని సందేశంతో రూపొందిన చిత్రం స్కూల్. పిల్లలు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు కూడా వారిని ఎలా పెంచి, భావిపౌరులుగా తీర్చిదిద్దాలి అనే పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం ఇది. తల్లిదండ్రుల అభిప్రాయాలను పిల్లలపై రుద్దడం, వారిలో ఒత్తిడిని పెంచడం వంటి విషయాల వల్ల విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురవుతారు, దానివల్ల కలిగే అనర్థాలు ఏమిటి వంటి పలు అవగాహనతో కూడిన అంశాలతో రూపొందిన స్కూల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 23న తెరపైకి వచ్చింది. ఇది ప్రతి విద్యార్థి చూడాల్సిన చిత్రం కావడంతో వారందరూ చూసే విధంగా థియేటర్లో ఉచితంగా టికెట్లను అందిస్తున్నట్లు చిత్రవర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తల్లిదండ్రులతో కలిసి చిత్రం చూడడానికి వచ్చే పిల్లలు 9514799128 నంబర్‌కు ఫోన్ చేసి ఉచిత టికెట్లు పొందవచ్చునని వారు అందులో పేర్కొన్నారు.