–పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు
తిరుత్తణి: తిరువలంగాడులో ఓ యువకుడు హత్యకు గురైయ్యాడు. సంఘటనకు సంబంధించి ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తిరువలంగాడు సమీపంలోని నార్తవాడ గ్రామ శివార్లలో ముళ్ల కంపల వద్ద ఓ యువకుడిని హత్య చేసినట్లు ఆ ప్రాంత వాసులు శుక్రవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరువలంగాడు పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా శరీరంలో 20కు పైగా కత్తిపోట్లతో నరికి హత్య చేసినట్లు గుర్తించారు. వెంటనే సంఘటన ప్రాంతం చేరుకున్న ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్, తిరుత్తణి డీఎస్పీ కందన్ హత్యకు సంబంధించి విచారణ జరిపారు. అలాగే డాగ్ స్క్వాడ్ బృందం, వేలిముద్రల క్లూస్ టీం సైతం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. పోలీసుల విచారణలో పూండికి చెందిన లోకేష్(19) అనే యువకుడు డిప్లొమో ఫార్మసీ చదువుకుని మెడికల్ షాపులో పని చేసేవాడని తెలిసింది. పది రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు లోకేష్ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తెలిసింది. హత్యకు సంబందించి ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.