సాక్షి, చైన్నె: కలైంజ్ఞర్ కరుణానిధి స్మారక బ్రహ్మాండ గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రాన్ని తిరుచ్చిలో ఏర్పాటు చేయనున్నారు. రూ.290 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు శుక్రవారం సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. అలాగే, ఆలయాలలో ఏకకాల పూజల నిమిత్తం నిధులు అందజేశారు. సచివాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. హిందూ మత ధర్మాదాయ శాఖ నేతృత్వంలో ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 17 వేల ఆలయాల్లో ఏక కాల పూజల కోసం రూ.85 కోట్లు, విస్తరణ కింద అదనంగా 1000 ఆలయాలలో ఏక కాల పూజల నిమిత్తం డిపాజిట్ నిధిగా ఒక్కో ఆలయానికి రూ.2.50 లక్షలను సీఎం స్టాలిన్ అందజేశారు. మొత్తం రూ.25 కోట్లు కేటాయించారు. మొత్తం రూ.110 కోట్లు పంపిణీ చేశారు. దేవాలయాల్లో పనిచేసే పూజారుల పిల్లల సంక్షేమం కోసం, వారి ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌గా గత 2 సంవత్సరాల్లో 900 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున అందించారు. మంత్రి శేఖర్‌బాబు, సీఎస్ మురుగానందంఅదనపు ప్రధాన కార్యదర్శి డా.కె. మణివాసన్, దేవదాయ శాఖ కమిషనర్ పి.ఎన్. శ్రీధర్, అదనపు కమిషనర్ డాక్టర్ సి.పళని, జాయింట్ కమిషనర్ పి. జయరామన్ పాల్గొన్నారు.
తిరుచ్చిలో..
తిరుచ్చిలో రూ.290 కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచ స్థాయి హంగులతో కలైంజ్ఞర్ గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఈ పనులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకు స్థాపన చేశారు. కావేరి నదీ తీరంలోని తిరుచ్చి నగరంలో బ్రహ్మాండ హంగులతో ఈ భవనం నిర్మించనున్నారు. 1,97,337 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులతో లైబ్రరీ భవనం రూ.235 కోట్ల అంచనా వ్యయంతో తీర్చిదిద్దనున్నారు. రూ.50 కోట్లతో పుస్తకాలు, రూ. 5 కోట్లతో ఇతర టెక్నాలజీ సంబంధిత అంశాలను కొలువు దీర్చనున్నారు.1000 సీట్లతో ఆడిటోరియం సైతం రూపుదిద్దుకోనున్నది. చిన్న పిల్లల కోసం థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. రెండవ అంతస్తులో పరిశోధన కేంద్రం, వర్క్ షాపు, నాల్గవ అంతస్తు రోబోటిక్స్, డిజిటల్ సంబంధించిన అంశాలు, ఐదవ అంతస్తులో విజ్ఞాన కేంద్రం ఏర్పాటు కానున్నది.
అరుదైన పుస్తకాల కోసం ఒక విభాగం ..
డిజిటలైజేషన్ ప్రాంతం, డిజిటల్ స్టూడియో, పోటీ పరీక్షకు అవసరమయ్యే పుస్తకాలతో ఒక విభాగం, సెమినార్ హాల్స్ వంటి అనేక హంగులతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్ నెహ్రు, అన్బిల్ మహేశ్ పాల్గొన్నారు.